పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. ప్రగతి పథంలో ముందు వరుసలో నిలిచింది. అయితే, జాతీయ రాజకీయాల చలనశీలతను పట్టడంలో తెలంగాణ జెరంత వెనుకబడే ఉన్నదని చెప్పుకోవాలి. ఏడాదిన్నర క్రితం ఎన్నికల ప్రచార సభల్లో నాటి సీఎం కేసీఆర్ విడమర్చి చెప్తే అర్థం కాక దాన్ని ఓట్ల ప్రచారం కింద కొట్టేసినం గానీ దానర్థం, తాత్పర్యం ఇప్పుడర్థమైతాంది.
కాంగ్రెస్ పాలనచూసి, అది తమను గోసపెడుతున్న తీరును చూసి బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ కోణం నుంచి చూస్తే ఇది మొదటి పొరపాటు. అంతేకాదు, బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని గెలిపించుకోకపోవడం మరో పొరపాటు. బీజేపీ కోణం నుంచి చూస్తే ఇది రెండో పొరపాటు. డబుల్ ఇంజిన్ అని, జమిలి ఎన్నికలు అని, పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ అని ఊదరగొడుతున్న బీజేపీ మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడాన్ని, దాని పర్యవసానాలను తెలంగాణ సమాజం లోతుగా, సూక్ష్మంగా పరిశీలించాయి. అప్పుడే మనం చేసిన రెండో పొరపాటు అర్థమైతది. అలా పరిశీలించినప్పుడే టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా పరిణామం చెందడం, తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేయడం అనే కేసీఆర్ విస్తృత దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణలోని అంతస్సారం బోధపడుతుంది.
బీజేపీ ఆధిపత్యం నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఎంచుకొని, ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించేందుకు ముందడుగు వేశారనేది సుస్పష్టం. అందులో భాగంగానే ఫెడరల్ స్ఫూర్తి ఫరిడవిల్లేలా ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసేందుకు కృషి చేశారనీ, జాతీయ పార్టీలుగా చలామణి అవుతూ రాష్ర్టాల మీద పెత్తనం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం అందించేందుకు బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లారనే సంగతిని అర్థం చేసుకోవచ్చు. పన్నుల రూపంలో పైసలు గుంజుకుంటూ, జనాభా రూపంలో పార్లమెంటు స్థానాలను గుంజుకుంటున్న బీజేపీ తెలంగాణ సహా దక్షిణాది రాష్ర్టాలను తమ సామంత రాష్ర్టాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. స్వయం పాలనే లక్ష్యంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొని, పదేండ్లలో ప్రగతి ప్రస్థానంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన బీఆర్ఎస్ ఓడిపోతే దేశానికి జరిగే నష్టం పైన చెప్పుకున్నదే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో బీజేపీ ఆధిపత్యానికి తెలంగాణలో కేసీఆర్ అనే దుర్భేద్యమైన అడ్డు తొలగిపోయింది. ఈలోపు ఢిల్లీలో బీజేపీ గెలుపు మరో హెచ్చరిక.
దేశానికి ఉత్తర, దక్షిణ రాజకీయ కేంద్రాలైన ఢిల్లీ, తెలంగాణ మీద పట్టు సాధించడం బీజేపీ ఎత్తుగడల్లోని అసలు వ్యూహం. ఢిల్లీని కైవసం చేసుకోవడం ద్వారా తన మొదటి వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు తెలంగాణను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం మిగిలి ఉన్నది. ఈ విషయంలో కాంగ్రెస్‌కు పోయిందేం లేదు. బీజేపీ వచ్చేవరకు అధికారంలో ఉంటే సరిపోతుందన్నది దాని ఆలోచన. పరోక్షంగా చెప్పాలంటే బీజేపీకి కాంగ్రెస్ తోడు పెండ్లికొడుకు అన్నమాట.
కాబట్టి ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సమాజం ఇకనైనా సిద్ధం కావాలి. అటు జాతీయ, ఇటు రాష్ట్ర స్థాయిలో తమ నాయకత్వంపై ఏ మాత్రం సోయిలేక సతమతమవుతూ ఆటలో నుంచి ఎప్పుడో తప్పుకొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఎన్నడూ ప్రమాదం లేదు. దాని సమస్య అంతా ప్రాంతీయ పార్టీలే. ముఖ్యంగా కేసీఆర్ వంటి జాతీయ దృక్పథం కలిగిన నాయకుడే మోదీ-షా ద్వయానికి పెద్ద సమస్య.
దక్షిణ భారతదేశం మీద దండయాత్రకు ‘గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా’గా తెలంగాణను భావిస్తున్నది బీజేపీ అగ్రనాయకత్వం. ఢిల్లీ గెలుపుతో దేశం మీద దండయాత్రకు మార్గం మరింత సుగమమైంది. ప్రాంతీయ పార్టీలపై ప్రజలకున్న విశ్వాసాన్ని పెకిలించి వేయడం ద్వారా తమ ఆధిపత్యానికి ఉన్న అడ్డును తొలగించుకోవాలని యోచిస్తున్నది. ఆ వ్యూహాలకు ఆయా రాష్ట్ర ప్రజలు కూడా తలొగ్గుతున్నారని అర్థమవుతున్నది. ఢిల్లీ ఉదంతాన్ని అలానే అర్థం చేసుకోవాలి.
దేశంలో ప్రాంతీయ రాజకీయ నాయకత్వాలను పడగొట్టడం, తద్వారా తమ ఆధిపత్యానికి దారులు వేసుకోవడం అనే ఎత్తుగడలో మోదీ, అమిత్ షా ద్వయం విజయం సాధించింది. సరిగ్గా ఈ ప్రమాదాన్ని నివారించడం కోసమే టీఆర్ఎస్ను కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చి ప్రాంతీయ పార్టీల సమన్వయంతో ఐకమత్యంగా ముందుకు సాగాలని భావించారు. అయితే, ఈ ప్రత్యామ్నాయ దేశీయ రాజకీయ ఉద్యమాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. మన సమస్యలు మన చుట్టూ మాత్రమే ఉండవని, రాష్ర్టాల సమస్యలకు పరిష్కారం దేశ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయనే కేసీఆర్ దార్శనికతను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం అర్థం చేసుకోలేకపోయింది.
బరువులను ఎత్తేందుకు సునాయాసమైన ఉపాయాలను ఫిజిక్స్ మనకు అందిస్తున్నది. అట్లనేదేశంలో రోజురోజుకు పెరుగుతున్న బీజేపీ అనే బరువును ఉపాయంతో దించుకోవడానికి కేసీఆర్ వేసిన దీర్ఘకాలిక వ్యూహం మనకు అర్థం కాలేదు. దూపైనప్పుడే బాయిని తవ్వుకునే అలవాటున్న మనకు ఇకనైనా జాతీయ రాజకీయాల మీద సోయి రావాలి. నెత్తిమీద పడేదాకా నిర్లక్ష్యం చేసే రాజకీయ అవగాహన లోపాన్ని ఇప్పటికైనా సవరించుకోకపోతే భవిష్యత్తు తెలంగాణ తరాలు బాధపడటం ఖాయం.
త్యాగాలతో సాధించుకున్న, పదేండ్లు కష్టపడి నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పెనం మీద మాడుతాంది. ఇగ బీజేపీ పొయ్యిలో పడితే మాడి మసైపోతుంది. ఇప్పటికే తెలంగాణ సంపద పన్నుల పేరుతో కేంద్రానికి, మూటల రూపంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎక్కడికక్కడ చేరిపోతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను సాపసుట్టి సంకలో మడుసుకొని బీజేపీ తెలంగాణ మీద చేసే దండయాత్రను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉండాలి. బీజేపీ అనే దయ్యాన్ని జట్టుపట్టి నేలకు కొట్టే దమ్మున్న మొనగాడు కేసీఆర్ దిక్కు మల్లా మనం సూడకపోతే మరో వందేండ్లు ఎనకకు పోవడం ఖాయం. తెలంగాణ సమాజమా తస్మాత్ జాగ్రత్త!