హైదరాబాద్, జనవరి 24 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నది. ఒక్కొక్క విద్యార్థికి కనీసం లీటర్ చొప్పున స్వచ్ఛమైన, శుద్ధమైన మిషన్ భగీరథ తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 5 వేల లీటర్ల సామర్థ్యం గల సంపు, రెండొందల లీటర్ల సామర్థ్యం గల స్టీల్ ట్యాంకును ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు తొలి విడతలో రూ.5 కోట్లు వెచ్చించనున్నారు. సంప్‌లో మోటర్ బిగించి, పైపులైన్ల ద్వారా వాటర్ ట్యాంకుతో అనుసంధానం చేస్తారు. ట్యాంకు నుంచి నల్లాలు, పైపులైన్లను ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే సంప్‌లు, ట్యాంకులు ఉన్న స్కూళ్లను మినహాయించి, పనిచేయని, శిథిలమైన వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. విద్యాశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 22,882 స్కూళ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ, కొన్నిచోట్ల సంప్‌లు, ట్యాంకులు, నల్లాలు లేవు. వీటి ఏర్పాటుకు మన ఊరు- మన బడి నిధులను వినియోగించనున్నారు.