‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ఉంది వైద్య విద్య పట్ల కేంద్రం అనుసరిస్తున్న ధోరణి. దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడాలంటే వైద్యుల సంఖ్య కీలకం. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ వైద్య విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లాకొక వైద్య కళాశాల స్థాపిస్తున్నది. అందులోనూ అత్యధిక మెడికల్ సీట్లు స్థానికులకే దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నది. ఈ విషయమై న్యాయ పోరాటంలోనూ తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. అయితే తాజాగా కేంద్రం కొర్రీల రూపంలో సమస్య వచ్చిపడింది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటును అడ్డుకునే నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)తో జారీ చేయించింది. మామూలుగా వైద్య విద్యను ప్రోత్సహించేందుకు అనువైన పరిస్థితులుంటే కొత్త కళాశాలలను స్థాపించేందుకు, సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడమనేది జరగాలి. కానీ అందుకు వీల్లేకుండా దిగ్బంధనం చేస్తున్నది. దేశ అవసరాలు, సౌకర్యాలను బట్టి కాకుండా రాష్ట్ర జనాభాను బట్టి సీట్ల సంఖ్యను నిర్ణయించే విచిత్రమైన నిబంధనను ఎన్ఎంసీ ముందుకుతేవడం విపరీతమే.
కొత్త నిబంధన ప్రకారం 10 లక్షల జనాభాకు 100 సీట్లు మాత్రమే అనుమతిస్తారు. అంతకుమించి సీట్ల సంఖ్యను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఈ మేరకు ఎన్ఎంసీ జారీచేసిన సర్క్యులర్ తెలంగాణకే కాదు, వైద్య విద్యలో అగ్రగాములుగా అంగలు వేస్తున్న దక్షిణాది రాష్ర్టాలన్నిటికీ గుదిబండగా మారింది. ఈ సర్క్యులర్ ప్రకారం దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో కొత్త వైద్య కళాశాలలు స్థాపించడం కుదరదు. ఎందుకంటే ఇప్పటికే ఈ రాష్ర్టాల్లో వైద్యులు ఎక్కువైపోయారనే వితండవాదాన్ని కేంద్రం ముందుకుతెస్తున్నది. అంటే ఎన్నో అడ్డంకులను అధిగమించి వైద్య విద్యను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు దక్షిణాదిని శిక్షిస్తున్నారన్నమాట. ఎన్ఎంసీ సర్క్యులర్ ప్రకారం పోతే కొత్త వైద్య కళాశాలల ముచ్చటేమో గానీ ఉన్నవాటిలో సీట్ల పెంపు కూడా గగనమే అవుతుంది. ఇంకా విచిత్రం ఏమంటే ఉత్తరాదిలోని వెనుకబడిన యూపీ, బీహార్ రాష్ర్టాలు వైద్య విద్యలో ఎదిగేవరకూ దక్షిణాది రాష్ర్టాల్లో మెడికల్ సీట్ల పెంపుపై నిషేధం కొనసాగుతుంది. అంటే ఉత్తరాది వెనుకబాటుతనం సాకుగా చూపి దక్షిణాది ప్రగతిని అడ్డుకుంటారన్న మాట.
మెడికల్ సీట్ల సంఖ్యను ప్రమాణాలకు అనుగుణంగా నిర్ధారించడం ఎక్కడైనా జరిగేదే. అనుబంధ వైద్య చికిత్సాలయం, అందులోని సౌకర్యాల ఆధారంగా ఇది జరుగుతుంది. ఇది ఒక్కో రాష్ర్టాన్ని బట్టి మారవచ్చు. పైగా రాష్ర్టాలు తమ తమ పరిస్థితులను బట్టి వైద్య కళాశాలలను నెలకొల్పుకోవచ్చు. సీట్ల సంఖ్యనూ పెంచుకోవచ్చు. ఒక రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ అవసరం ఉన్న వేరే రాష్ర్టానికి వెళ్లి సేవలు అందించడని చెప్పలేం కదా? ఈ మాత్రం తర్కం కేంద్రానికి అర్థం కాదని అనుకోవాల్నా? జనాభా పేరు చెప్పి వైద్య విద్య ఎదుగుదలను అడ్డుకోవడం సబబు కాదు. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక డాక్టర్ ఉండాలని సిఫారసు చేస్తే మన దేశంలో 834 మందికి ఒక డాక్టర్ చొప్పున ఉన్నారని ఆ మధ్య కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది.
ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న అలోపతి వైద్యుల సంఖ్యకు ఆయుర్వేద, యునానీ తదితర ఆయుష్ వైద్యులనూ కలిపి చూపించింది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. ఇది పట్టణ ప్రాంతాలకు పరిమితమైన లెక్కింపు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల సమస్య తెలిసిందే. అసలు లెక్కలు తీస్తే వెయ్యి మందికి ఒకరు కాదు రెండు వేలమందికి ఒకరు చొప్పున మన దేశంలో వైద్యులున్నారు. అంటే మన దేశంలో వైద్యుల సంఖ్యను రెట్టింపు చేస్తే గానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన స్థాయికి చేరుకోలేం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం… తెలంగాణలోని 3.8 కోట్ల జనాభాకు 3,809 సీట్లు మాత్రమే వస్తాయి. కానీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు సమకూర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో మెడికల్ సీట్లు 8,515కు పెరిగాయి. అంటే కేంద్రం కొత్త నిబంధనల కంటే నాలుగు వేల పైచిలుకు సీట్లు అదనంగా ఉన్నాయన్నమాట. ఉన్న సీట్ల సంగతి అలా వదిలేస్తే, కొత్త సీట్లు మంజూరు కావాలంటే మాత్రం రాష్ట్ర జనాభా 8.5 కోట్లకు చేరుకోవాలి. కేంద్రం తుగ్లక్ విధానాలకు ఇది పరాకాష్ఠ!