సిద్దిపేట, సెప్టెంబర్ 22: “నాడు కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం… కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నరు” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నాగరాజుపల్లె గ్రామానికి కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ ఆహీగర్, ఇమామ్, హమీద్, జకిరెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో సాధించుకున్న తెలంగాణ… నేడు కాంగ్రెస్ హయాంలో సర్వరోగంగా తయారైందన్నారు. ప్రజల గుండెల్లో నిలిచేది గులాబీ జెండానే… కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని హరీశ్‌రావు అన్నారు.