కోదాడ, సెప్టెంబర్ 16 : నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటయ్య అన్నారు. బుధవారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎంతోమంది కమ్యూనిస్టు నేతలు తమ జీవితాలను తృణప్రాయంగా త్యజించి నైజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అమరుల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకుల దుశ్చర్యలను ఖండిస్తూ ఉద్యమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేదిక సభ్యులు నాగమణి, రామ నరసయ్య, స్వామి, జి ఎల్ ఎన్ రెడ్డి, హరికిషన్ రావు, అప్పిరెడ్డి, ఎస్ఎస్ రావు పాల్గొన్నారు.