Tariffs War : అగ్రరాజ్యం అమెరికా (USA) కు.. కెనడా (Canada) , మెక్సికో (Mexico) దేశాలతో సుంకాల యుద్ధం (Tariffs war) మొదలైంది. అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంపై కెనడా, మెక్సికో దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి. అందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తునట్లు ఆ దేశ ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ప్రకటించారు. మెక్సికో కూడా అలాంటి ఆదేశాలే జారీ చేసింది.
155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25% టారిఫ్‌లు విధిస్తున్నామని, ట్రంప్ చర్యలకు ఇది ప్రతిస్పందన అని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం ఈ మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని, మిగిలిన టారిఫ్‌లు 21 రోజుల తర్వాత అమలవుతాయని చెప్పారు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని ట్రంప్ అనుకుంటే తమతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలని, అదే వారికి మంచిదని పేర్కొన్నారు.
మెక్సికో కూడా కెనడా బాటలోనే నడుస్తోందని, తాము కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ అన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో మెక్సికో ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వం 4 నెలల్లో 20 మిలియన్ డోస్ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుందని, దాదాపు పదివేల మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మెక్సికో ఎల్లప్పుడూ పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుందే తప్ప ఘర్షణను కాదని అన్నారు.
మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందుకు కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అధిక సుంకాలు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని క్లాడియా వ్యాఖ్యానించారు. మెక్సికన్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ప్లాన్-బీని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శిని ఆదేశిస్తున్నానని షేన్‌బామ్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో రాసుకొచ్చారు.
మరోవైపు చైనాపై సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) లో అమెరికా నిర్ణయాన్ని సవాలు చేస్తామని ప్రకటించింది. కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ శనివారం తీసుకున్న నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Valentines Day | ప్రేమంటే ఏంటి.. ఎక్కడ మొదలవుతుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది?
Fassion | నయా ఫ్యాషన్.. ముద్దుగుమ్మల పాదాలను అందంగా అలంకరిస్తున్న కడియాలు