పాపాయి కాలికి ముచ్చటగా కుదిరింది. అమ్మమ్మ కాలికి అందంగా అమరింది. మరి అమ్మాయి పాదానికో… అబ్బ ఓల్డ్ ఫ్యాషన్… కాదు కాదు, ఇప్పుడది బోల్డు ఫ్యాషన్. నిజమే, కాళ్లకు కడియాలు పెట్టడం పాత ట్రెండు అంటే మాత్రం అది అచ్చంగా పాత ముచ్చటే అవుతుంది. చీర కట్టినా, జీన్సు వేసినా విభిన్నంగా కనిపించేలా ఇప్పుడు అమ్మాయిలు రకరకాల కడియాలను కాలికి తొడిగేస్తున్నారు మరి!
Fassion | ఫ్యాషన్‌కి మ్యాజిక్ తెలుసు. ఆకాశంలో ఎగిరే ఆకుపచ్చ చిలుకను అమాంతంగా అందాల లాకెట్లో అమర్చేయగలదు. అంతెత్తు గుళ్లూ గోపురాలను చీర మీద చిన్నవిగా చూపించేయగలదు. కొత్త దాన్ని పాతగానే కాదు, పాత దాన్ని కొత్తగానూ చటుక్కున మార్చేయగలదు. అంతేకాదు, అందరితోనూ అబ్బో అనిపించనూ గలదు! అందుకే అందరూ ఫ్యాషన్ వెంటే పరిగెడుతుంటారు. ఎంత పాత అయితే అంత గొప్ప అన్నట్టుగా… అమ్మమ్మ కంచిపట్టు చీరల్ని ట్రెండీ జాకెట్లకు ముడివేసి వారెవ్వా అనిపించిన ఆ ఫ్యాషనే, ఇప్పుడు తాతమ్మల కాలి కడియాలను నేటి ముద్దుగుమ్మల పాదాలకు అందంగా అలంకరిస్తున్నది. ఆ బొమ్మలకూ ఇవి తెగనచ్చడంతో కడియాలు… ‘కడా యాంక్లెట్స్’, ‘కడా పాయల్’గా మార్కెట్లో తెగ సందడి చేస్తున్నాయి.
భారతదేశంలో ముఖ్యంగా తెలుగు వారిలో ఇంకా చెప్పాలంటే తెలంగాణలో కడియాలతో పూర్వం నుంచీ అనుబంధం ఉంది. ఇక్కడి ఆడవాళ్లే కాదు, మగవాళ్లూ వాటిని ధరిస్తారు. రాగి, వెండి, ఇత్తడి, పంచలోహాల్లాంటి రకరకాల లోహాలతో వీటిని చేస్తారు. ధరించేవారిని బట్టి, లోహం, డిజైన్ మారుతుంటాయి. ఎక్కువమంది ఆడవాళ్లు బొటనవేలి లావున, నున్నగా గుండ్రంగా ఉండే కడియాలు ధరిస్తే, లంబాడా లాంటి కొన్ని తెగల్లోని వాళ్లు అలలాగా ఉండే డిజైన్‌తో కాస్త సన్నటి రకానివి పెట్టుకుంటారు. మగవాళ్లలోనూ కాస్త పల్చగా ఉండే వెడల్పాటి కడియాన్ని ధరించే సంప్రదాయం ఉంది.
ఉద్దండులైన పండితులకు బంగారంతో చేసి తొడిగే గండ పెండేరమూ కడియమే. అయితే, ఆడపిల్లలు ఈ కడియాలను ధరించడం అన్నది పాత పద్ధతి అయిపోయింది ఓ రెండు తరాలుగా. కానీ ఇప్పుడు రెట్రో ఫ్యాషన్ పుణ్యమా అని ఇవి మళ్లీ మిలామిలా మెరుస్తున్నాయి. అడ్జస్టబుల్గా ఉండే వీటిలో ఎన్నో నగిషీలు, మరెన్నో మోడళ్లూ దొరుకుతున్నాయి. మువ్వలు, పూసలు, క్రిస్టళ్లు, రాళ్లలాంటివి జోడించి వస్తున్నాయి. కొన్నిటిలో చిన్న లాకెట్నూ వేలాడదీస్తున్నారు. ఏది ఎవరికి ట్రెండీగా అనిపిస్తే దాన్ని ఎంచుకోవచ్చు. చీరలనే కాదు, జీన్సు, ట్రౌజర్స్, చుడీదార్ల మీదకీ వీటిని పెట్టుకుంటున్నారు. మా నయా ఫ్యాషన్ ఇవేనయా అంటున్నారు!