‘జనవరి జయం జయం.. ఫిబ్రవరి పెండ్లికి పిలుపు’ అని చిన్నప్పటి గేయం. వాలంటైన్ పుణ్యమా అని ఫిబ్రవరి అంతా ప్రేమికుల మాసంగా మారిపోయింది. ఈ నెల కోసం యువత ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రేమను వ్యక్తం చేయడానికి, ప్రేమించిన వారితో సమయం గడపడానికి వాలెంటైన్ డేని చాలామంది ఓ ప్రత్యేకమైన సందర్భంగా భావిస్తారు. గిఫ్ట్‌లు, టూర్లు ప్లాన్ చేస్తారు. ఫిబ్రవరి 14వ తేదీ ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. గులాబీలు, చాక్లెట్లు, ఖరీదైన బహుమతుల కొనుగోళ్లతో అన్ని షాపులు బిజీ బిజీ. మనిషిని ఇంతలా వశపరచుకుంటున్న ఈ ప్రేమ ఎక్కడ మొదలవుతుంది? ఎన్ని రకాలుగా ఉంటుందో.. తెలుసుకుందాం.
Valentines Day | పరీక్షలఅప్పుడెప్పుడో గజినీ సినిమాలో సూర్య, అసిన్ ‘హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది..’ అంటూ ప్రేమ గీతం పాడుకుంటే అందరూ ఫిదా అయ్యారు. ప్రేమ మనిషిలో ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి ఒక్కరూ ప్రయత్నించలేదు. సైకాలజిస్టులు మాత్రం ఈ అంశంపైన దృష్టి సారించారు. న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజ్‌కి చెందిన బినాక అస్విడో రొమాంటిక్ లవ్‌పై పరిశోధనలో భాగంగా ప్రేమ మెదడులో ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ప్రేమలో ఉన్నవారికి ప్రేయసి లేదా ప్రియురాలు ఫొటో చూపించినప్పుడు మెదడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ), న్యూక్లియస్ అకమ్బన్స్, వెంట్రల్ పల్లిడియం, రఫే న్యూక్లియస్ ప్రాంతాలు ఉత్తేజితమయ్యాయని ఎఫ్.మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ద్వారా తెలుసుకున్నారు.
తొలి రోజుల్లో..
వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా రివార్డ్ సిస్టంలో కీలకమైన ప్రాంతం. నూతన ప్రేమికుల్లో ఈ ప్రాంతం బాగా ఉత్తేజితమవుతుందని పరిశోధనలో తేలింది. వెంట్రల్ పల్లీడియం, రఫే న్యూక్లియస్ ప్రాంతాలు 20 ఏళ్ల తర్వాత కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండటానికి కారణమని తెలుస్తుంది. వెంట్రల్ పల్లీడియం అటాచ్మెంట్ హార్మోన్లను విడుదల చేసి బంధం నిలబడేలా చేస్తుంది. దీర్ఘకాలిక ప్రేమికుల్లో రఫే న్యూక్లియస్ సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ చేసి బంధంలో కుదురుకునేటట్టుగా చేస్తుంది. మనుషుల్లో ప్రేమ భావన పెంపొందడంలో మెదడులోని రివార్డ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుందని న్యూరోసైన్స్ చెబుతుంది. మెదడులోని హిప్పో క్యాంపస్, మీడియల్ ఇన్సుల, యాంటీరియర్ సింగ్లేట్ భాగాలు రివార్డ్ సిస్టంలో ప్రధాన పాత్ర పోషించి ప్రేమ అనే భావన వృద్ధి చెందేలా చేస్తాయని పరిశోధనలో తేలింది.
కెమికల్ గడబిడ ..
ప్రేమ అనే ఫీలింగ్ కలిగినప్పుడు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై హార్వర్డ్ మెడికల్ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల ఫలితమే ప్రేమ అని తేల్చి చెప్పారు. ప్రియురాలితో చూపు కలవగానే మెదడులో ఫినెల్ తలామిన్ అనే రసాయనం విడుదలవుతుంది. అరచేతుల్లో చెమట పట్టడం.. మోకాళ్లు వణకడం ఈ హార్మోన్ ప్రభావమే. ఈ లవ్ మాలిక్యూల్ కొద్ది మోతాదులో చాక్లెట్లా ఉంటుంది. అందుకనే వాలంటైన్ రోజు చాక్లెట్ల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఒక మనిషిపై వ్యామోహం కలగడానికి మెదడు విడుదల చేసే అడ్రినలిన్, డోపమైన్, నారెఫీనెప్రిన్ హార్మోన్లే కారణం. నచ్చినవారి చూడగానే శరీరంలో ఈ హార్మోన్లు విడుదలై అనేక స్పందనలు కలిగిస్తాయి. అందుకే ప్రేమికులు గంటల కొద్దీ కబుర్లు చెప్పుకొంటారు. ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ దశలో వీరిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని ప్రభావంతో ఒకరిని ఒకరు టచ్ చేయాలని, హగ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ హార్మోన్ల ప్రభావం 3 నెలల నుంచి 18 నెలల వరకూ ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రేమ ప్రయాణం దీర్ఘ కాలం కొనసాగితే వాసోప్రెసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఇద్దరి మధ్య బంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది.
ఏడు రంగుల వాన…
నేటి యువత ప్రేమ అని అనుకుంటున్నది ప్రేమ కాదు. కేవలం వ్యామోహం మాత్రమే. నిజమైన ప్రేమ అంటే ఏమిటో సైకాలజిస్ట్ స్టర్న్ బెర్గ్ తన త్రిముఖ ప్రేమ సిద్ధాంతంలో వివరించారు. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉన్నట్టే ప్రేమకు మౌలికాంశాలు అయిన సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతల కలయికలతో ఏడు రకాల ప్రేమలు పుడతాయని ఆయన వివరించారు. లైకింగ్, ఇన్ ఫ్యాట్, లవ్, ఎంప్టీ లవ్, రొమాంటిక్ లవ్, కంపానియట్ లవ్, ఫటస్ లవ్, కంజుమేటివ్ లవ్ అని ఏడు రకాల ప్రేమలు ఉంటాయని వివరించారు. వీటన్నిటిలోనూ కంజుమెట్ లవ్ అనేది అతి ముఖ్యమైనది. నేటి యువత రొమాంటిక్ లవ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధత కలగలిసిన ప్రేమే నిజమైనది, శాశ్వతమైనది. దాన్ని సాధించడం ఎంత కష్టమో, నిలుపుకోవడం కూడా అంతే కష్టం. ప్రేమ స్వరూపాన్ని, పరిపూర్ణత్వాన్ని అర్థం చేసుకున్న వారికి అది ఒక ఎమోషన్‌లా కాకుండా, మోటివేషన్‌లా పనిచేస్తుంది. ప్రేమ సఫలమైనా, విఫలమైనా జీవితంలో ముందుకు తీసుకువెళ్తుంది.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261