High Blood Pressure | ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది ప్రజలు హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవన విధానం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటివన్నీ హైబీపీ వచ్చేందుకు కారణం అవుతున్నాయి. పూర్వం హైబీపీ అంటే కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్న వారు కూడా హైబీపీ బారిన పడుతున్నారు. అయితే హైబీపీ ఉందని తేలితే కచ్చితంగా డాక్టర్ సూచన మేరకు జీవితాంతం మందులను వాడాల్సిందే. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఓ వైపు మందులను క్రమం తప్పకుండా వాడుతూనే మరోవైపు వ్యాయామంపై దృష్టి పెట్టాలి. అలాగే పోషకాహారం కూడా తీసుకోవాలి. బీపీని నియంత్రించడంలో ఆహారం ఎంతగానో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కనుక హైబీపీ ఉన్నవారు కచ్చితంగా పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. ఈ బెర్రీ పండ్లలో ఆంథో సయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తాయి. కనుక హైబీపీ ఉన్నవారు ఈ బెర్రీ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తింటున్నా ఉపయోగం ఉంటుంది. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువల్ల వీటి జ్యూస్‌ను రోజూ తాగుతున్నా కూడా బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. హైబీపీ తగ్గేందుకు బీట్ రూట్ సైతం మేలు చేస్తుంది. బీట్ రూట్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఇవి రక్త నాళాలను ప్రశాంత పరుస్తాయి. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్‌ను తాగుతుంటే హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
నారింజ, గ్రేప్ ఫ్రూట్, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఇతర సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి కూడా రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి బీపీ తగ్గేలా చేస్తాయి. యాపిల్, కివి, అవకాడోలు, డ్రై యాప్రికాట్స్ వంటి పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. చిలగడ దుంపలు, టమాటాలు, బ్రోకలీని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కూడా బీపీని అదుపులో ఉంచుతాయి. ఓట్స్, బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్, పాస్తా, కినోవా, బార్లీ వంటి తృణ ధాన్యాలు కూడా బీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీని తగ్గిస్తాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. వారంలో ఒకటి లేదా 2 సార్లు చేపలను తింటుంటే మేలు జరుగుతుంది. పప్పు దినుసులు, శనగలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.
హైబీపీ ఉన్నవారు టోఫు, సోయా ఉత్పత్తులను తీసుకోవాల్సి ఉంటుంది. సోయా టోఫు, సోయా పాలు, మీల్ మేకర్ వంటివి మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే వృక్ష సంబంధ ప్రోటీన్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. హైబీపీ ఉన్నవారు కొవ్వు ఉన్న పాలను తాగకూడదు. కొవ్వు లేని పాలను తాగాలి. పెరుగు కూడా కొవ్వు లేని పాలతో తయారు చేసింది అయితే మంచిది. ఇక హైబీపీ ఉన్నవారికి బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు మేలు చేస్తాయి. వీటిని అన్నీ కలిపి రోజుకు గుప్పెడు తిన్నా చాలు ఎంతో మేలు జరుగుతుంది. ఇక వంట నూనెల విషయానికి వస్తే రిఫైన్డ్ నూనెలు కాకుండా గానుగలో ఆడించిన నూనెలు అయితే మంచిది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, తులసి వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇలా ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకుంటే బీపీని గణనీయంగా తగ్గించుకోవచ్చు. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.