Small Onions | ఉల్లిపాయలను మనం రోజువారి ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాం. వీటిని పలు రకాల కూరలు లేదా వంటకాల్లో వేస్తుంటారు. వీటిని నేరుగా పచ్చిగా కూడా తినవచ్చు. ఉల్లిపాయల వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది. కూరలు ఘాటుగా కూడా ఉంటాయి. కారం చాలలేదు అనుకునేవారు కూరలతో ఉల్లిపాయలను కూడా అలాగే నేరుగా తింటుంటారు. అయితే ఉల్లిపాయల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో చిన్న ఉల్లిపాయలు కూడా ఒకటి. వీటినే షాలోట్స్ లేదా పెరల్ ఆనియన్స్ అని కూడా పిలుస్తారు. చిన్న ఉల్లిపాయల్లోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చిన్న ఉల్లిపాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక పోషకాలను పొందడంతోపాటు పలు వ్యాధులు కూడా నయమవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చిన్న ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్ అని పిలవబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతోపాటు సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ అలర్జిక్ గుణాలను కలిగి ఉంటాయి. చిన్న ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. దీంతో తీవ్రమైన వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. చిన్న ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఈ ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
చిన్న ఉల్లిపాయల్లో ఉండే క్వర్సెటిన్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ ఉల్లిపాయలను తింటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఈ ఉల్లిపాయల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు, సల్ఫర్ సమ్మేళనాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీంతో రోగాల నుంచి త్వరగా బయట పడవచ్చు. చిన్న ఉల్లిపాయల్లో ఆల్లియం అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. అందువల్ల ఈ ఉల్లిపాయలను తింటే క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణాశయ, పెద్దపేగు క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు.
చిన్న ఉల్లిపాయల్లో ఉండే క్వర్సెటిన్ సహా ఇతర సమ్మేళనాల వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. చిన్న ఉల్లిపాయల్లో స్వల్ప మొత్తంలో మాంగనీస్ ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. ఈ ఉల్లిపాయల్లో ఉండే పొటాషియం వల్ల ఎముకల సాంద్రత పెరిగి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే సాధారణ ఉల్లిపాయల కన్నా చిన్న ఉల్లిపాయలు కాస్త ఘాటు తక్కువగా ఉంటాయి. కనుక వీటిని నేరుగా తినవచ్చు. అదే ఉడకబెడితే మరింత తియ్యగా మారుతాయి. కానీ పోషకాల శాతం తగ్గుతుంది. కనుక చిన్న ఉల్లిపాయలను నేరుగా తింటేనే అధిక మొత్తంలో లాభాలు కలుగుతాయి. ఇలా వీటిని తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.