హైదరాబాద్, సెప్టెంబర్ 20: సైబర్ మోసాలపై నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ పేరుతో బజాజ్ ఫిన్సర్వ్ శనివారం నాడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా వివిధ రకాల సైబర్ ముప్పులు, ఆర్థిక భద్రత కోసం పాటించాల్సిన ఉత్తమ పద్ధతులపై డిజిటల్ వినియోగదారులకు అవగాహన కల్పించారు. దిల్సుఖ్నగర్లోని శ్రీసాయి డిగ్రీ, పీజీ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సౌత్ ఈస్ట్ జోన్ సైబర్ సెల్ ఎస్సై ఎస్. మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నకిలీ ఓటీపీ మోసాలు, ఫిషింగ్ దందాలు, డిజిటల్ అరెస్టులు, ఆర్థిక రుణ మోసాలు, పింఛన్ మోసాలు తదితర మోసాల గురించి సవివరంగా వివరించారు.
బాధితుల ఆలోచన విధానాన్ని, స్వభావాన్ని గమనించి సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటూ ఉంటారని ఎస్సై మల్లేశం తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు, యువతనే మోసగాళ్లకు సాఫ్ట్ టార్గెట్ అవుతుంటారని తెలిపారు. వారు తమ వ్యక్తిగత వివరాలను ఆలోచించకుండా సోషల్మీడియాలో పంచుకుంటారని, ఎవరినైనా ఈజీగా నమ్మేస్తారని అన్నారు. ఈ అలవాట్లే వారిని సైబర్ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే సోషల్మీడియా ప్రొఫైల్ను గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. సోషల్మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్లను పెట్టుకోవాలని.. టు స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.
ఎన్బీఎఫ్సీల కోసం రిజర్వ్ బ్యాంక్ 2024లో విడుదల చేసిన ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగా నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ కార్యక్రమం ఉంది. ఈ మార్గదర్శకాలు మోసాలను తొలిదశలో గుర్తించడం, సిబ్బంది బాధ్యతను నిర్ధారించడం, ప్రజలతో సక్రియ భాగస్వామ్యం కల్పించడం వంటి అంశాల ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపులు, ఆర్థిక సంస్థలను అనుకరించే వెబ్సైట్లు, స్కామర్లు తప్పుడు అనుబంధాలు క్లెయిమ్ చేయడం, సంస్థ ఉద్యోగులను అనుకరించడం, వ్యక్తిగత సమాచారాన్ని చెల్లింపుల కోసం దుర్వినియోగించడం వంటి పలు పద్ధతులు ద్వారా ప్రజలను మోసం చేస్తుండటంపై దృష్టి సారించింది.