బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్రాల బిల్లులను తొక్కిపెట్టడం అనేది ఇప్పుడు ఓ తెగని సమస్య. రాజ్భవన్లను ఉపయోగించుకొని విపక్ష ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తున్నది. తెలంగాణలో కేసీఆర్ హయాంలో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లులను తన వద్దే అట్టిపెట్టి కాలయాపన చేశారు. తమిళనాడు గవర్నర్ ఎన్.రవి అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తుండటం చూస్తున్నాం. బెంగాల్ వంటి కొన్ని ఇతర రాష్ర్టాల్లోనూ ఈ తరహా రగడే కొనసాగుతున్నది. దీనిపై గత ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్లు నిరంతరంగా బిల్లులను ఆపివేయడానికి వీల్లేదని, మూడు నెలల్లోగా తిప్పిపంపకపోతే ఆ బిల్లులు ఆమోదం పొందినట్టుగా భావించవచ్చని ద్విసభ్య ధర్మాసనం చెప్పడం సంచలనం కలిగించింది. గవర్నర్తో పాటుగా రాష్ట్రపతికీ గడువు పెట్టడం ప్రత్యేకించి చర్చనీయాంశమైంది. సమాఖ్యవాదాన్ని రక్షించడంలో ఈ తీర్పు ఓ ముందడుగు అని అందరూ భావించారు. కానీ, కేంద్రం మరోలా తలచింది. గడువు సహా పలు అంశాలపై సుప్రీంకోర్టు అభిప్రాయాలను కోరుతూ రాష్ట్రపతి ప్రస్తావన పంపారు. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఈనెల 20న వెలువరించిన తీర్పు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలను పక్కన పెట్టింది.
కేంద్రం ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలతో చెలగాటమాడటాన్ని నిరోధించేందుకు న్యాయమూర్తులు పార్దీవాలా-మహదేవన్ చొరవ తీసుకున్నారు. రాజ్యాంగంలోని అస్పష్టతను తార్కికతతో సరిచేయాలని చూశారు. కానీ, సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆ తార్కికతను ఏకగ్రీవంగా తిరస్కరించింది. రాజ్యాంగంలో గడువు అనేది లేనప్పుడు కోర్టు మాత్రం ఎందుకు విధించాలనే ధోరణి దీని వెనకాల ఉన్నది. ఈ స్వీయనియంత్రణ మంచిదే కానీ గణతంత్రానికి, రాజకీయ వ్యవస్థకు మధ్య రాజ్యాంగపరమైన సమతుల్య స్ఫూర్తిని సాధించే విషయాన్ని పక్కనపెట్టడం జరిగింది. రాజ్యాంగంలోని అస్పష్టతను ఉపయోగించుకొని కేంద్రం గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను చికాకు పెడుతున్నదనేది వాస్తవం. ఒక రాష్ట్రంలో రెండు అధికార కేంద్రాలుండటం ఎలా కుదురుతుందని తమిళనాడు లేవదీసిన ప్రశ్నను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ప్రతినిధిగా గవర్నర్ వేధించడం వెనుక రాజకీయం తప్ప మరో కారణం లేదనేది స్పష్టంగా తెలుస్తున్నది.
మన రాజ్యాంగం కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య తేడాను చూడటం లేదు. ప్రాంతీయ, జాతీయ ఆకాంక్షలు విభిన్నంగా ఉండటమే అందుకు కారణం. ఈ దృష్ట్యా సమాఖ్యవాదంవైపే మొగ్గుచూపి బలమైన కేంద్రం, బలమైన రాష్ర్టాలను ఏర్పరిచింది. అయితే సామరస్య రాజకీయాలు ఏమాత్రం గిట్టని కాంగ్రెస్, బీజేపీలు సమాఖ్యవాదాన్ని నీరుగారుస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగపర్చడంలో కాంగ్రెస్ ఆరితేరితే, బీజేపీ రెండాకులు ఎక్కువే చదివినట్టు వ్యవహరిస్తున్నది. విచక్షణాధికారానికి విపరీతార్థాలు తీస్తూ, ప్రజల తీర్పును రెండు పార్టీలు అపహాస్యం చేశాయి. ఈ ధోరణికి ముకుతాడు వేసే ప్రయత్నాలకు పురిట్లోనే గండిపడింది. రాష్ట్రపతి ప్రస్తావనకు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానాలతో గవర్నర్ల పాకెట్ వీటోకు మరోసారి పచ్చజెండా ఊపినట్టయింది. కథ మళ్లీ మొదటికి వచ్చింది.