న్యూఢిల్లీ: హైవేలపై టోల్ను వసూలు చేసేందుకు అనుసరిస్తున్న ప్రస్తుత విధానం ఓ ఏడాదిలో ముగుస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని స్థానంలో ఎలక్ట్రానిక్ విధానం ఓ ఏడాదిలోగా అమల్లోకి వస్తుందన్నారు. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే 10 చోట్ల ప్రారంభించినట్లు తెలిపారు. దీనిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వస్తే హైవేలపై టోల్ కోసం వాహనాలను ఆపేవారు ఉండరని తెలిపారు. ఇటీవల విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రామ్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. మన దేశంలోని హైవేలపై టోల్ వసూళ్లను క్రమబద్ధీకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.