CEC’s removal : దేశ చరిత్రలోనే తొలిసారి విపక్ష ఎంపీలు ఎన్నికల ప్రధాన కమిషనర్ (Chief Election
Commissioner) జ్ఞానేశ్‌కుమార్ (Gyanesh Kumar) ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ
నోటీస్ ఇవ్వబోతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నోటీస్‌పై ఇప్పటికే దాదాపుగా 200
మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు వెల్లడించాయి. అందులో 130 మంది లోక్‌సభ సభ్యులు (Lok
Sabha members), 63 మంది రాజ్యసభ సభ్యులు (Rajya Sabha Members) ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్ తొలగింపు నోటీస్‌పై ఎంపీలు ఉత్సాహంగా సంతకాలు చేస్తున్నారని, ఇప్పటికే నోటీస్ ఇచ్చేందుకు అవసరమైన ఎంపీల సంఖ్య పూర్తయ్యిందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ గురువారం చెప్పినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ నిబంధనల ప్రకారం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ తొలగింపు కోరుతూ నోటీస్ ఇవ్వాలంటే ఆ నోటీస్‌పై కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు, కనీసం 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ సంఖ్య ఇప్పటికే దాటినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష ఇండి కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు ఈ నోటీస్‌పై సంతకాలు చేసినట్లు సమాచారం. ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా సంతకాలు పెట్టినట్లు తెలుస్తున్నది.
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఆయన తొలగింపును కోరుతూ ఎంపీలు నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.