– వి. ఫణిరాజు, కల్లూర్.
హోటళ్లలో ఎవరైనా అన్నమే పెడతారు. ఎక్కడ కూడా విషం కలిపి పెట్టరు. మరెందుకని మంచి హోటల్ కోసం వెతకడం? ఇదికూడా అంతే! సృష్టిలో శుభ-దోషాలు కలిసి ఉంటాయి. అది విశ్వాత్మ చట్టం. దానిని ప్రశ్నించే హక్కు మనిషికి లేదు. ఎందుకంటే, ఈ భూమి, పంచభూతాలు మనిషి సృష్టించినవి కావు. మనిషి కన్నా ముందునుంచే ఉన్నాయి. స్థలం నిర్ధారణ అనేది ఎంతో ముఖ్యం. అక్కడ ఉంటే శుభస్థితి (పాజిటివ్ వాతావరణం) జీవితాలను ఎంతగానో ప్రభావం చేస్తుంది. అమృతం-విషం, చీకటి-వెలుగు, మంచి-చెడు.. ఇవి లేనిది భూమి అనిపించుకోదు.
ఎంపిక అనేది మనిషి చేతిలో ఉంటుంది. చాలామందికి అర్థంకానిది ఏంటంటే.. అతని మనసు ఎలాంటిది? అనేది. అదిచాలు.. అతణ్ని ఎక్కడికైనా తీసుకుపోవడానికి. ఎంతో గొప్పగా ఇల్లు కట్టుకుంటారు. కానీ, దానికి దిశలు ఉండవు. వీధిపోట్లు ఉంటాయి. అది అతని ఇష్టంతోనే కదా నిర్మాణమైంది. కానీ, ఏం చేయలేడు. అలా.. వ్యక్తి జీవితం ఉన్నతి కోసం శాస్త్రం కానీ.. కొట్టివేయడానికి, మార్చడానికి కాదు. శాస్త్రం ఎవరినీ నష్టపెట్టాలని చూడదు. అందరి బతుకులు బాగుపడాలనే ఆలోచిస్తుంది. ఎవరి కర్మలను బట్టి వారి నిర్ణయాలు ఉంటాయి. వాళ్ల జీవితాలు ఉంటాయి.
– పి. శంకర్, పటాన్చెరు.
స్థలం పెద్దదిగా ఉన్నప్పుడు ఏ విధంగానైనా చేసుకోవచ్చు. కానీ, అది శాస్త్ర ఆమోదంగా ఉండాలి. అన్నదమ్ములు ఎవరి ఇల్లు వాళ్లు క్రమపద్ధతిలో దక్షిణం నుంచి ఉత్తరానికి లేదా పడమర నుంచి తూర్పు వైపు పెద్దవాళ్లు పడమర లేదా దక్షిణం ఉండేలా నివసించాలి. ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఎంతో ఆనందం, ఆదర్శం. అయితే, ఇండ్లు వేరైనప్పుడు ఎవరి హద్దులు కూడా ఒకటిగా ఉండకుండా సపరేటుగానే ఉండాలి. అంటే, కాంపౌండ్లు వేరవ్వాలి. అందరూ నాలుగు దిక్కులా నలుగురు.. నైరుతి, ఆగ్నేయం, వాయవ్యం, ఈశాన్యంగా సూచనల మేరకు ఇండ్లు కట్టుకొని, మధ్యలో ఓపెన్ స్థలం వదిలి కిచెన్ కట్టుకోవచ్చు. కిచెన్, డైనింగ్ మొత్తం స్థలానికి ఆగ్నేయం లేదా వాయవ్యంలో స్వతంత్రంగా.. ఏ గృహానికీ అంటుకోకుండా కట్టాలి. అన్నీ తెలుసుకుని జాగ్రత్తగా, అవగాహనతో జీవించడం అవసరం.
– బి. రుక్మిణి, కీసర.
ఇంటిలోని గదులలో దాదాపు పడక గదులే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి. మిగతా గదులు కిచెన్, డ్రాయింగ్ రూమ్, పూజగది అందరూ వాడుకునేవే! ముఖ్యంగా ఈశాన్యంలోని డ్రాయింగ్ ఏరియా, హాల్ తదితర బాల్కనీలు, లాంజ్‌లు అన్నీ అందరూ.. అంటే, ఇంటికి వచ్చిన అతిథులు ఎక్కువగా వాడుకునేలా ఉండాలి. ఇవి అందరివి. అందరూ వెళ్లగలిగేలా ఉండాలి. ఇంట్లో ఉమ్మడి జీవితం ఉంటుంది. అలాగే, ఎవరి ఏకాంతాన్నీ చెడగొట్టకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరి హద్దులు వాళ్లు పాటిస్తూనే అందరూ కలిసి ఉండేదే కుటుంబం అవుతుంది. ఇందులో ఈశాన్యం గదిని అటు ఆగ్నేయం పడకగది వాళ్లు కానీ, వాయవ్యంలోని వారుకానీ సొంతం చేసుకుంటే.. అది వాళ్లకే చెందినది అవుతుంది. అన్నివేళలా అందరూ ఆ చోటికి వెళ్లలేరు. అలాగే, తూర్పు-ఉత్తరం బాల్కనీలు వాడలేరు. ఆ విధానం కరెక్ట్ కాదు. ఏ అవయవం దానికది ప్రత్యేకమే అయినా, అందరికీ ఆహారశక్తి కడుపే కదా! దానిమీద అన్నిటికీ హక్కు, అవకాశం లేకుండా చేయకూడదు కదా! ఈశాన్యం గది కూడా అంతే!
– కె. రమేశ్, కొత్తగూడెం.
అసూయ, అజ్ఞానం వెర్రితలలు వేస్తే ఇలాగే ఉంటుంది. మీ లేఖ చదివాను. మీ ఊరిలో మీరంటే కొందరికి పడదు. మీరు ఆ పోచమ్మ గుడికి కాంపౌండు కట్టించడం వారికి ఇష్టంలేదు. తద్వారా.. ఎక్కడ మీకు పేరు వస్తుందోనని అలా పుకార్లు, అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అసూయలే కదా.. ఇప్పుడు రాజ్యాలు ఏలుతున్నాయి. ఏ గుడికి అయినా హద్దును, ఆరోగ్యాన్ని, శక్తికి అందించేవి ప్రాకారాలు (కాంపౌండ్లు). వాటిని ఆయా గుళ్లకు ఆయా తీరులలో గుడిని బట్టి, ఆ చోటును బట్టి, శాస్త్ర ప్రకారం కడుతుంటారు. ఎంత చిన్న గ్రామ దేవతల ఆలయానికి అయినా ఒక ప్రాకారం ఇవ్వగలిగితే.. అది అత్యంత శక్తివంతమై, ఆ పల్లె హృదయాలకు ప్రహారా కాస్తుంది. మనిషి ఉన్నచోట మలినం ఉంటుంది. మహిమాన్వితుడు (దైవం) ఉన్నచోట మహత్తు ఉంటుంది. అలాంటి మహత్తు విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి కాంపౌండ్లు ఎంతో అవసరం. కొన్ని జీవాలయాలు ఒకటి కాదు.. మూడు, ఐదు ప్రాకారాలు, గోపురాలతో అలరారుతుంటాయి. మీ కార్యం మీరు చేయండి. తెలిసినవారు తెలుసుకుంటారు. మీకు, మీ గ్రామ ప్రజలకు శుభాలు కలుగుతాయి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143