వనపర్తి, జూలై 18 (నమస్తే తెలంగాణ) : కరువు పరిస్థితులను తలపిస్తున్న ప్రస్తుత వ్యవసాయ సీజన్లో కరెంట్ కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. జూన్, జూలై నెలల్లో వర్షాల ప్రభావం మందగించడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. నా రుమడులకు బోరు, బావుల నుంచి నీరు పెడదామనుకునే రైతులకు కష్టాలు ఎదురుకావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వెరసి జిల్లాలో అనధికారికంగా మరింతగా విద్యుత్ కోతలు పెరిగాయి.
వర్షాభావ పరిస్థితుల్లో అందోళన చెందుతున్న రై తులను విద్యుత్ సమస్యలు మరింత వేధిస్తున్నాయి. వ్యవసాయానికి ఉదయం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా 14 గంటలు విద్యు త్ సరఫరా అందించాల్సి ఉన్నది. ఈ క్రమంలో పరిస్థితులు తారుమారవుతున్నాయి. 24 గంటల కరెంట్ పేరుకే తప్పా వ్యవసాయానికి మాత్రం అందడం లే దని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మూడ్రోజులు గా మరో నాలుగు గంటలు అదనంగా విద్యుత్ కో తలు విధిస్తుండడంతో సాగుకు 10 గంటలు సరఫ రా కావడం గగనం. దీంతో రైతు లు క్షేత్రస్థాయిలో కరెంట్ సమస్యలతో అల్లాడుతున్నారు. వర్షాలు లేక సేద్యం పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. అందుకు సరైన ఉత్ప త్తి లేకపోవడంతో మొత్తానికే తగ్గించేస్తున్నారు.
ఎండల ప్రభావం.. దీనికి తోడు వర్షాలు లేకపోవడం తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. జూన్, జూలై నెలల్లో 45 రోజుల వ్యవధిలోనే వనపర్తి జిల్లా వ్యా ప్తంగా 300 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. ఒక్కో రోజు 10 వరకు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయంటే పరిస్థితులు ఎలా ఉందో అర్థమవుతోం ది. వర్షాల్లేక అధికంగా బోర్లు, బావుల నుంచి మోట ర్ల వినియోగం పెరిగి లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కా లిపోతున్నాయి. ఇటీవల ఎండల ప్రభావం సైతం తీవ్రంగా ఉండటంతో గృహ వినియోగం అదే స్థాయి లో పెరుగుతోంది. వీటన్నింటినీ తట్టుకోవాలంటే పుష్కలమైన కరెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది. కానీ, చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లు పరిస్థితులున్నాయి. కాలిన ట్రాన్స్ఫార్మర్లకు బదులుగా వెంటనే మరో ట్రాన్స్ఫార్మర్ను రైతులకు అందిస్తుండటంలో ఇబ్బందుల్లేవు. రైతులకు సమస్యంతా నాణ్యమైన విద్యుత్ సరఫరాలోనే ఎదురవుతోంది.
వచ్చే మరో పది రోజులు విద్యుత్ వినియోగం ఇలాగే పెరిగితే.. కరెంట్ సరఫరా పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. రోజు వా రీగా కేటాయించే యూనిట్లకం టే అధికంగా యూనిట్ల వాడ కం పెరిగింది. ఈ మేరకు సాధారణ వి నియోగం కన్నా పది శాతం అదనంగా పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో వర్షా లు లేనందున కేటాయించిన దానికంటే వినియోగం పెరుగుతోంది. పెరుగుతున్న వినియోగం తగ్గించేందుకు లోడ్ రిలీఫ్ పేరిట కోతలు పెరు గుతూనే ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయంలో ఓవర్ లోడ్ వంటి సాంకేతిక సమ స్యలు తలెత్తుతున్నాయి. కరెంట్ ఎ ప్పుడు వస్తుందో..? ఎప్పుడు పోతుం దో? కూడా తెలియని స్థితి ఉన్నదని ప లువురు అన్నదాతలు పేర్కొంటున్నారు.
వర్షాలు లేకున్నా.. బోరు, బావుల ఆధా రంగా రైతులు కొన్ని చోట్ల నాట్లు వేసుకుంటున్నారు. వర్షాలు రాకపోతాయా? అన్న నమ్మకంతో సేద్యానికి చేయాల్సిన పనులు చక్క బెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
వర్షాలు వస్తాయన్న ఆశతో మూడెకరాల్లో వరి వేసు కున్నాం. బోరు బావిపై ఆధారపడి సాగు చేస్తున్నా. వాన జాడ లేకుండా పోయె. కరెంట్ కోతలతో అసలు కష్టం ఇప్పుడు మొదలైంది. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. బోర్లు తగ్గుతున్నాయి. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. నీరు అందక పంట ఎండడం మొదలైంది. కరెంట్ అయినా సక్రమంగా ఉంటే నెల రోజులైనా వరిని బతికించుకుంటం.
– బిచ్చారెడ్డి, గోవర్ధనగిరి, వీపనగండ్ల మండలం
సేద్యం ఎగుడు దిగుడు అవుతుంది. ఐదు ఎకరాల పొలం ఉంటే, ఎకరా వరి వేసినా, మిగితా బుడ్డల కోసం సిద్ధం చేసుకున్నా. ఆ ఎకరా వరి పొలం తడపాలన్నా కష్టమవుతుంది. కరెంట్ కోతలు పెరుగుతున్నాయి. గందరగోళంగా ఉంది. అసలు వానలు వస్తాయా..రావా అన్నది అర్థమైత లేదు. ఇలాగే రైతుల పరిస్థితి ఉంటే చాలా ఘోరంగా ఉంటది.
– శేషన్న, ముమ్మాయిపల్లి, కొత్తకోట మండలం
రెండు నెలలుగా వర్షాభావ పరిస్థి తులు నెలకొన్నందున విద్యుత్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒక్క సారిగా వినియోగం పెరిగి పో యింది. దీనికి ఎండల ప్రభావం తోడవ్వడంతో సమస్య మరింత పెరిగింది. ఇటు గృహ వినియోగం.. అటు వ్యవసాయ అవసరాలు సమానంగా రావడంతో సరఫరాలో కొంత మేర సమస్య తలెత్తుతోంది. పైనుంచి వచ్చే పరిస్థితుల మేరకు కొన్ని మార్పులు తప్పడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం పెరిగింది. కర్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నాం.
– తాతారావు, విద్యుత్ ఎస్ఈ, వనపర్తి జిల్లా