చందంపేట(దేవరకొండ), డిసెంబర్ 4 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డిండి మండలం రహమంతాపురం గ్రామానికి చెందిన 20 మంది యువకులు, చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలకు వివరించాలని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పొగాకు శ్రీశైలం, పందుల జగదీశ్ గౌడ్, రవీందర్రావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.