సూర్యాపేట, డిసెంబర్ 4 : కాంగ్రెస్‌ను గెలిపిస్తే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లేనని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా… ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. పారిశ్రామికవాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములు అమ్ముతూ రూ.ఐదు లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించనున్నారని, మెజార్టీ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రూ.345 కోట్లతో గ్రామాలకు ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో నడిపారన్నారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని, గ్రామాల్లో సెక్రటరీలు సైతం తప్పించుకొని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంతో అనుభవం ఉందని, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు నమ్ముతుంటే కాంగ్రెస్ నాయకులు వారిని నామినేషన్లు వేయకండా బెదిరింపులకు గురిచేస్తూ డబ్బు, మద్యంతో గెలవాలనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలతోపాటు విద్య, వైద్యం, రోడ్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు బోనస్, మద్దతు ధర ఇవ్వకపోగా, కనీసం వడ్లు కొనే దిక్కులేదన్నారు. పింఛన్లు పెం చుతామని, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వలేదని, యువతకు ఉద్యోగాలు లేవని.. ఇలా ప్రతి రంగా న్నీ నిర్వీర్యం చేసిందన్నారు. హైదరాబాద్‌లో పారిశ్రామికవాడలకు ఇచ్చిన ప్రభు త్వ భూములను అమ్ముకునే ఆలోచన చేస్తున్నారని, ఇది రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణమన్నారు. సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, జానకిరాంరెడ్డి తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరికలు
మిర్యాలగూడ, డిసెంబర్ 4: రెండేండ్ల పాలనలో కాంగ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మాడ్గులపల్లి మండలం పాములపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తోట సత్తిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి పట్టణంలోని రెడ్డికాలనీ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సత్తిరెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
ఈనెల 14న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి చింతకాయల సైదులు గెలుపు కోసం వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధే గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలు ట్ల బాబయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్, మాజీ సర్పంచ్‌లు యాతం లక్ష్మీనరేందర్రెడ్డి, జానయ్య, సర్పంచ్ అభ్యర్థి చిం తకాయల సైదులు, వేముల సందీప్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.