అడుగు లేని బావిలో రూపాయి పతనం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు ఇదే పరాకాష్ఠ అనుకోవడం పరిపాటి అయిపోయింది. డాలర్ విలువలో రూపాయి గత మంగళవారం 89.94గా ఉన్న రూపాయి విలువ మరుసటిరోజు 90 పైచిలుకు స్థాయికి పడిపోయింది. చారిత్రికంగా ఇదొక సరికొత్త మైలురాయి. భారతదేశ ప్రస్తుత ఆర్థిక స్థితికి ఈ పతనం అద్దం పడుతున్నది. దీని ప్రభావం కేవలం స్టాక్ మార్కెట్ లేదా ఫారెక్స్ వ్యాపారానికే పరిమితమని అనుకోరాదు.
డాలర్ రేటు గొలుసుకట్టు ప్రభావం అన్నిరంగాలపైనా ఉంటుం ది. విద్యారుణాలు మొదలుకొని విదేశీ యాత్రల టికెట్ల దాకా అన్నీ దీనివల్ల పెరుగుతాయి. ఈ సరికే ధరల భారం కింద నలిగిపోతున్న సగటు భారతీయునిపై ఇది మరింత ఒత్తిడిని పెంచుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులకు, ముఖ్యంగా ముడిచమురుకు డాలర్లలోనే చెల్లింపులు జరపాల్సి ఉండటమే ఇందుకు కారణం. భారత్ తనకు అవసరమైన చమురులో 90 శాతం వరకు దిగుమతి చేసుకుంటుంది. ఇంకా ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఎరువులు, వంట నూనెలకు కూడా దిగుమతులే దిక్కు.
ఇంతకూ రూపాయి అధఃపాతాళానికి ఎందుకు పతనమైందీ అని పరిశీలిస్తే మనకు మూడు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది అమెరికాతో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు. భారత-అమెరికా వాణిజ్య చర్చలు విఫలం కావడం, భారతీయ దిగుమతులపై అమెరికా 50 శాతం దాకా సుంకాలు విధించడంతో బిజినెస్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. రెండు, ద్రవ్యోల్బణం సాపేక్షంగా స్థిరంగానే ఉండి, జీడీపీ ఊర్ధ్వముఖంగా చూస్తున్నప్పటికీ, విదేశీ పెట్టుబడుల పలాయనం రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నది.
ఈ ఏడాది ఇప్పటివరకు విదేశీ మదుపరులు 17 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మన ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. మూడు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత ఆర్థికవ్యవస్థను స్థిరమైన అనే వర్గీకరణ నుంచి తొలగించి, తాపీగా కదులుతున్న అనే జాబితాకు మార్చడం. ఇది అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను మసకబార్చి పలుకుబడిని మరింతగా తగ్గించింది. రూపాయిని బ్లూంబర్గ్ ఈ ఏడాది ఆసియాలో అత్యంత దారుణమైన పనితీరు ప్రదర్శించిన ‘కరెన్సీ’గా పేర్కొనడం గమనార్హం.
దశాబ్దకాలంపైగా కొనసాగుతున్న ఎన్డీయే పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైందనడానికి రూపాయి విలువ పతనమే అతిపెద్ద నిదర్శనం. దిగుమతులను తగ్గించుకునేలా స్వదేశీ వనరులను, స్థానిక ఉత్పత్తిని పెంచుకోవడంలో ఘోర వైఫల్యాన్ని ఇది సూచిస్తున్నది. మేకిన్ ఇండియా అంటూ టాంటాం వేసుకొని ప్రారంభించిన పథకం గుట్టుచప్పుడు కాకుండా అటకెక్కింది. మేరా దోస్త్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సాగించిన స్నేహాయనం సాధించింది శూన్యం.
పైగా అదే ట్రంప్ బాదుతున్న టారిఫ్‌లతో భారత్ కుదేలవుతున్నది. ప్రధాని అట్టహాసంగా జరిపిన విదేశీ పర్యటనలు అంబానీలకు, అదానీలకు ఉపయోగపడ్డాయేమో గానీ దేశ వాణిజ్యానికి ఏ రకంగానూ తోడ్పడలేదని ఇప్పటి మన ఏకాకితనం తెలియజేస్తున్నది. నిజానికి మన్మోహన్ సింగ్ మార్గదర్శకత్వంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ వల్ల రూపాయి పతనం వేగం పుంజుకున్నది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ కేంద్రం చేతకానితనం వల్లే రూపాయి పడిపోతున్నదని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆయన హయాంలోనే రూపాయి పూర్తిగా భ్రష్ఠు పట్టడం విడ్డూరం.