హాలియా, డిసెంబర్ 4 : హాలియాలో నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ పేరుతో ఈనెల 2,3,4 తేదీల్లో 51వ అంతర్ జిల్లాల బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడాపోటీల కారణంగా నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌లో ఉన్న లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. హాలియాలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌తో సంబంధం లేదని ఉపాధ్యక్షుడు మాజీత్, జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగ లక్ష్మణ్‌యాదవ్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు భూలోకరావు, కర్తయ్య నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ పేరు చెప్పి క్రీడా వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ బాధ్యులమైన మాకు సమాచారం ఇవ్వకుండా హాలియాలో మూడు రోజులపాటు కబడ్డీ పోటీలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. అంతర్జిల్లా కబడ్డీ పోటీలకు నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌కు ఏం సంబంధం లేదని వారు తెలిపారు. నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ పార్టీలకు అతీతమైనదని, వీరిద్దరు మాత్రం….ఏ పార్టీ అధికారంలో ఉంటే… ఆ పార్టీకి వంత పాడటం పరిపాటిగా మారిందన్నారు.
పోటీల విషయమై జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. చందదారులకు ఇచ్చిన గౌరవం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న భూలోకరావుది… సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి గ్రామం అని తెలిపారు. జిల్లా కార్యదర్శిగా వ్యవరిస్తున్న కర్తయ్య ఆంధ్రా ప్రాంత ఉద్యోగి అని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడని పేర్కొన్నారు. 30 ఏండ్లుగా ఆయన నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌లో తిష్టివేసి అసోసియేషన్లోకి ఉత్తమ క్రీడాకారులు రాకుండా అడ్డుకుంటున్నారని ఉపాధ్యక్షుడు మాజీత్, జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగ లక్ష్మణ్‌యాదవ్ ఆరోపించారు. ఆంధ్రా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతున్న కర్తయ్య ఇప్పటికీ నల్లగొండ కబడ్డీ అసోసియేషన్ వీడి… కొత్తవారికి ఎందుకు అవకాశం కల్పించడం లేదని నిలదీశారు. ఒకరు పొరు గు రాష్ట్ర ఉద్యోగి అయితే… మరొకరు పక్క జిల్లా వాసి… వీరిద్దరికీ నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌తో ఏం సంబంధం అని ప్రశ్నించారు. వీరు నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ పేరు చెప్పి క్రీడా వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కొంతకాలంగా వీరు కబడ్డీ అసోసియేషన్‌లో నైపుణ్యమైన క్రీడాకారులను ఎంపిక చేయడం మర్చిపోయారు. డబ్బులు ఇచ్చిన వారికి, పైరవీకారులకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తున్నట్లు వీరిపై ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. వీరితీరు ప్యాకెజీ ఇచ్చుకో… జిల్లా కబడ్డీ అసోషియేషన్ పేరుతో టోర్నమెంట్ పెట్టు కో అన్న చందంగా మారిందని విమర్శించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ పేరుతో వీరు క్రీడా వ్యాపారం నిర్వహి స్తూ దర్జాగా జీవించడంతో పాటు క్రీడాకారుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని వారు ఆరోపించారు.