న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలిపే అధికారాలను నియంత్రించే ఆర్టికల్ 200లో ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదం లేకపోయినా గవర్నర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు మంగళవారం పేర్కొంది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్ సమ్మతించడానికి, రాష్ట్రపతికి నివేదించడానికి కోర్టు నిర్దేశిత కాలపరిమితి విధించవచ్చా? అన్న అంశంపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు 8వ రోజు విచారణ కొనసాగింది.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సంబంధించి గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 200 వివరించిందని, దాని ప్రకారం గవర్నర్లు బిల్లుకు ఆమోదం తెలపాలి, లేదా ఆమోదాన్ని నిలువరించాలి, పునః పరిశీలన కోసం, లేదా నిలిపివేత కోసం రాష్ట్రపతికి పంపాలని కోర్టు తెలిపింది. గవర్నర్ నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలను సెప్టెంబర్ 10న ముగించాలని ధర్మాసనం నిర్ణయించింది.