త్రివేండ్రం: వ్యభిచార గృహంలో సెక్స్‌వర్కర్ నుంచి సేవ పొందుతున్న విటుడిపై అనైతిక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేయవచ్చునని కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఎందుకంటే అలాంటి సేవలకు చెల్లింపులు వ్యభిచారాన్ని ప్రేరేపించడమే అవుతుందని పేర్కొంది. సెక్స్ వర్కర్లను వాణిజ్య లావాదేవీలలో వస్తువుగా పరిగణించ రాదని జస్టిస్ వీజీ అరుణ్ కీలక తీర్పు చెప్పారు.
వ్యభిచార గృహాలలో సేవలు కోరుతున్న విటులు సెక్స్ వర్కర్ల దోపిడీలో చురుకైన భాగస్వాములు కాబట్టి, వారిని కేవలం కస్టమర్లుగా పరిగణించలేమని తెలిపారు. ఒక వ్యక్తిని వినియోగదారుడిగా పరిగణించాలంటే అతను ఏదైనా వస్తువు లేదా సేవలను కొనుగోలు చేయాలని, అయితే సెక్స్ వర్కర్‌ను ఒక వస్తువుగా, ఆమె అందించే లైంగిక సుఖం ఒక సేవగా పరిగణించలేమని తెలిపింది.
అలాంటి వృత్తిలో ఉన్న వారిని మానవ అక్రమ రవాణా ద్వారా తీసుకువచ్చి బలవంతంగా ఆ వృత్తిని చేయిస్తుంటారని, వారు ఒక విధంగా బాధితులేనని ఆయన తీర్పులో పేర్కొన్నారు. విటుడు తాను పొందే సేవలకు సొమ్ము చెల్లించినప్పటికీ అది ఎక్కువ భాగం వ్యభిచార గృహ నిర్వాహకులకే చేరుతుందన్నారు. కేసు వివరాల్లోకి వెళితే.. ఒక వ్యభిచార గృహంలో సెక్స్‌వర్కర్ నుంచి సేవలు పొందుతున్న తనపై కేసు పెట్టారని ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. తాను కస్టమర్‌గా వారి వద్దకు వెళ్లి సేవలు పొందానని వాదించాడు.