వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అమెరికాతో వాణిజ్య చర్చల కోసం ఏదో ఒక సమయంలో భారత్ దిగిరాక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అంచనా వేశారు. భారత్ దిగిరాని పక్షంలో అది ఆ దేశానికే మంచిది కాదని రియల్ అమెరికాస్ వాయిస్ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బెదిరించారు.
భారత్ వస్తువులపై విధించిన రెట్టింపు సుంకాలను ప్రస్తావిస్తూ భారత్‌ని సుంకాల మహరాజుగా ఆయన ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఏ దేశంపై విధించనంత భారీ సుంకాన్ని అమెరికా భారత్‌పై విధించిందనడంలో ఎటువంటి సందేహం లేదని, భారత్‌తో అలా వ్యవహరించక తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ముందు వరకు ఏదో ఒకటి రెండు చుక్కలు తప్పితే భారత్ ఏనాడూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయలేదని ఆయన అన్నారు.
రష్యా నుంచి కొనుగోలు చేసే చమురుతో భారత్ లాభాలు గడిస్తుంటే అమెరికన్లు మాత్రం యుద్ధం కోసం తమ సంపాదనను పంపాల్సి వస్తోందని నవారో వ్యాఖ్యానించారు. ఏదో ఒక సమయంలో భారత్ కూడా దిగిరాక తప్పదు. అలా జరగకుండా రష్యా, చైనాతోనే జత కట్టాలని భారత్ భావిస్తే అది భారత్‌కే మంచిది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తే అది యావత్ శాంతికి మంచి చేస్తుందని ఆయన చెప్పారు.