మాదాపూర్, జూన్ 23 : హైడ్రా తీరుతో ఆందోళన చెందిన సున్నం చెరువు బాధితులు న్యాయం కోసం రోడ్డెక్కారు. మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను హైడ్రా అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులను ఇవ్వడం తో పాటు సర్వే చేపట్టడం తో సున్నం చెరువు బాధితులు హైడ్రా తీరును వ్యతిరేకిస్తూ సోమవారం ధర్నా చేపట్టారు. దీంతో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రాయల పార్టీ నాయకులు సున్నం చెరువు బాధితులతో కలిసి ధర్నాకు సంఘీభావం తెలిపారు. బాధితులతో కలిసి అక్రమ సర్వేను ఆపండి.. ప్రజల హక్కులను కాపాడండి అంటూ నినాదాలు చేశారు.
హైడ్రా డౌన్ డౌన్, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ సున్నం చెరువు పూడిక తీతను అడ్డుకున్నారు.
దీంతో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని హైడ్రాకు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కార్తీక్ రాయల మాట్లాడుతూ..సున్నం చెరువు బాధితులను హైడ్రా అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, హైడ్రా పేదల పాలిట శాపంగా మారిందన్నారు. ఏండ్ల కాలం నుండి జీవనం సాగిస్తున్న పేదల బతుకులను రోడ్డున వేయడం సరికాదన్నారు. హైడ్రా అధికారులు ఇకనైనా తమ తీరు మార్చుకొని పేద ప్రజలకు అండగా నిలవాలని, లేదంటే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సున్నం చెరువు బాధితులు ఉన్నారు.