మునుగోడు, సెప్టెంబర్ 02 : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు భోజనం అందించాలని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కృష్ణాపురం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పలివెల, ప్రాథమిక పాఠశాల రావిగూడెం, కస్తూర్బా గాంధీ విద్యాలయం మనుగోడు పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలో FLN కార్యక్రమం, ఉన్నత పాఠశాలలో LIP కార్యక్రమాలను ఫలవంతంగా కొనసాగించాలని, సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేశారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ తరగతులు ఐ ఎఫ్ పి ప్యానల్ ద్వారా విద్యార్థులు తొందరగా అర్థం చేసుకుంటారని, తగిన సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. డీఈఓ వెంట ప్రధానోపాధ్యాయులు సీహెచ్.వెంకటయ్య, పలివెల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీనివాసులు, రావిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెల్లం మోహన్, కస్తూరిబా గాంధీ విద్యాలయం ఎస్ఓ పుష్పలత ఉన్నారు.
Munugode : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : డీఈఓ భిక్షపతి