అయిజ : ఆర్టీసీ బస్సులు ( RTC Buses) నిలపడంలేదని శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం గ్రామంలోని అయిజ – కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డుపై విద్యార్థులు, తల్లిదండ్రులు బైఠాయించారు.
బస్సులు సమయానికి రాకపోవడంతోపాటు ప్రయాణికులతో నిండుగా వస్తుండటంతో బస్సులు ఎక్కాలంటే స్థలం లేక పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక విద్యాబోధన కోల్పోతున్నామని విద్యార్థులు వాపోయారు. ఉదయం 8 గంటల నుంచి పర్దిపురం గ్రామంలోని బస్‌స్టాప్‌లో నిలిచి ఉన్నా కర్నూల్ వైపు నుంచి వచ్చే బస్సులను కొందరు డ్రైవర్లు, కండక్టర్లు నిలపకుండా పోతున్నారని పేర్కొన్నారు.
గ్రామంలో స్టాప్ ఉన్న విషయమే కొందరు డ్రైవర్లు, కండక్టర్లు మర్చిపోయారని ఆరోపించారు. బస్సులు నిలుపని విషయం డీఎం, ఆర్టీసీ అధికారులకు పలు మార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని విద్యార్థులు వివరించారు. పాఠశాలలు, కళాశాలల సమయాలకు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
శాంతినగర్, జులెకల్, వెంకటాపూర్, పర్దిపురం మీదుగా అయిజ వరకు ప్రత్యేకంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు అంతర్రాష్ట్ర రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న అయిజ ఎస్సై శ్రీనివాసరావు, ఆర్టీసీ కంట్రోలర్ కృష్ణ పర్దిపురానికి చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు నచ్చచెప్పారు. ఆర్టీసీ డీఎంతో ఎస్సై చర్చించి అన్ని బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ధర్నా విరమించారు.
ఆర్టీసీ డీఎం సునీత ఎమన్నారంటే ?
ఈ విషయమై గద్వాల డీఎం సునీత ( DM Sunita) ను ఫోన్లో నమస్తే తెలంగాణ సంప్రదించగా కర్నూల్ వైపు నుంచి వచ్చే ప్రతి బస్సు పర్దిపురంలో నిలుపుతున్నామని తెలిపారు. గ్రామంలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని, విద్యార్థులు అందరూ ఒకే సారి బస్సులను ఆశ్రయిస్తుండటంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సమయానికి అనుగుణంగా కొందరు విద్యార్థులు 8 గంటల నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తే బాగుటుందని, ప్రత్యేక బస్సులు నడిపేందుకు బస్సులు అందుబాటులో లేవని తెలిపారు.