Viral news : రోడ్డు ప్రమాదం (Road accident) లో అన్న మరణించడంతో విధవరాలైన అతడి భార్యను మరిది పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బదౌన్ జిల్లా (Badaun district) లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వదినను, కుటుంబసభ్యులను ఒప్పించి మరీ అతడు ఆమెను వివాహం చేసుకున్నాడు. దీనిపై స్థానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన రాజేశ్ సింగ్ అనే యువకుడి అన్న కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దాంతో అతడి భార్య చిన్న వయసులోనే వైధవ్యం మూటగట్టుకుంది. చిన్న వయస్సులోనే వదినను అలా చూడలేకపోయిన రాజేశ్ సింగ్ ఆమెను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు.
ఆమె అంగీకరించడంతో కుటుంబసభ్యులకు కూడా విషయం చెప్పి ఒప్పించాడు. అనంతరం అందరి సమక్షంలో ఆమెను ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రాజేశ్ సింగ్ తీసుకున్న నిర్ణయంపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంప్రదాయం ఉందని, అమ్మాయి ఇష్టపడితే ఇందులో తప్పులేదని ఈ వార్తపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే సమాజం ఇలాంటి వాటిని స్వీకరించదని, ఇలాంటి సంఘటనలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.