Ben Stokes : యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు బౌలర్ల అధిపత్యం నడువగా.. బ్యాటర్లు తోక ముడిచారు. ఇంగ్లండ్‌ను 172కే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ‘మమ్మల్నే పడగొడుతారా.. ఇక మా ప్రతాపం చూసుకోండి’ అంటూ ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా పర్యాటక జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) సంచలన బౌలింగ్‌తో ఆశ్చర్యపరిచాడు. యాషెస్ టెస్టు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో ఇంగ్లండ్ సారథిగా అవతరించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టు జరుగుతోంది. తొలి సెషన్ నుంచే ఉత్కంఠ రేపిన పెర్త్ టెస్టులో మొదటిరోజే 19 వికెట్లు పడ్డాయి. బౌలర్లు వికెట్ల వేట పండుగ చేసుకున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో విజృంభించిన అతడు దిగ్గజ కెప్టెన్లకు సాధ్యంకాని రికార్డు తన పేరిట రాసుకున్నాడు. ఈ మైలురాయికి చేరువైన ఇంగ్లండ్ రెండో కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు స్టోక్స్. అతడికంటే ముందు 1982లో అప్పటి కెప్టెన్ బాబ్ విల్లిస్ ఈ రికార్డు నెలకొల్పాడు. గబ్బా టెస్టులో విల్లిస్ ఐదు వికెట్లతో కంగరూలను కష్టాల్లోకి నెట్టాడు.
Ben Stokes is the first England captain to take an Ashes five-for in Australia since Bob Willis claimed 5 for 66 at the Gabba in 1982 🙌 pic.twitter.com/8fzLPg2CBm
— ESPNcricinfo (@ESPNcricinfo) November 21, 2025
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను మిచెల్ స్టార్క్ (7-58) కోలుకోలేని దెబ్బతీశాడు. మిస్సైల్లాంటి బంతులో ఇంగ్లీష్ బ్యాటర్లను వణికించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చెలరేగడంతో స్టోక్స్ టీమ్ 172కే ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు మొదటి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ (2-11)షాకిచ్చాడు. మార్నస్ లబూషేన్(9)తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ జేక్ వీథర్లాండ్(0)ను రెండో బంతికే ఎల్బీగా వెనక్కి పంపాడు.
Ben Stokes takes five!
What a stunning opening day of the #Ashes that was. pic.twitter.com/0SOcPi5jE2
— cricket.com.au (@cricketcomau) November 21, 2025
కాసేపటికే లబూషేన్‌ను బౌల్డ్ చేసిన ఆర్చర్ వికెట్ల వేటకు తెరతీశాడు. ఆ తర్వాత బ్రైడన్ కార్సే స్టీవ్ స్మిత్(17), ఖవాజా(2)లను ఔట్ చేయగా.. అక్కడి నుంచి బెన్ స్టోక్స్(5-23) జోరు చూపించాడు. మిడిలార్డర్ బ్యాటర్లైన ట్రావిస్ హెడ్(21), కామెరూన్ గ్రీన్(24), అలెక్స్ క్యారీ(26), మిచెల్ స్టార్క్(12), స్కాట్ బోలాండ్(0)లను ఔట్ చేసి ఐదో వికెట్లతో జట్టును పోటీలోకి తెచ్చాడు. ఈ ఈ పేస్ ఆల్‌రౌండర్ ధాటికి ఆలౌట్‌కు ఒక వికెట్ దూరంలో ఉంది ఆతిథ్య జట్టు. తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్లకు 123 రన్స్ చేసిన ఆసీస్ ఇంకా 49 పరుగులు వెనకే ఉంది.