గద్వాల, నవంబర్ 20 : జూరాల డ్యాం గేట్ల సేఫ్టీపై ఆందోళన వ్యక్తమవుతున్నది. మరమ్మతుల్లో జాప్యం కారణంగా లీకేజీ సమస్యలు తలెత్తాయి. రిపేర్లు చేయాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. దీంతో ఇటు అధికారులకు, అటు రైతులకు తలనొప్పిగా మారాయి. గత జూన్ నెలలో జూరాల గేట్లకు కొన్నింటికి రోప్స్ తెగిపోవడంతోపాటు గేట్లు ఎత్తే క్రేన్ మొరాయించడంతో ప్రాజెక్టుకు ముంపు పొంచి ఉన్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అధికారులు అప్పటికప్పుడు కొన్ని గేట్లకు మరమ్మతులు చేపట్టారు. ఈ వానకాలం సీజన్లో నిరంతర వరదలు రావడంతో గేట్ల వద్ద పనులు నిలిచిపోయాయి. వరదలు నిలిచిపోయిన సమయంలో కాంట్రాక్టర్ రిపేర్లు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తున్నది.
కాంట్రాక్టర్ చేపట్టకపోవడంతో ప్రాజెక్టుకు ఎప్పుడు.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా గురువారం జూరాల ప్రాజెక్టు 32వ గేటుకు సంబంధించి రోప్ తెగి పోయి గేటు సైడ్, కిందభాగంలో ఉన్న రబ్బర్ సీల్స్పై పడడంతో డ్యామేజ్ అయ్యాయి. రబ్బర్ సీల్స్ డ్యామేజ్ కావడంతో లీకేజీలు మొదలయ్యాయి. దీంతో నీరు వృథాగా దిగువకు వెళ్తున్నది. వీటితోపాటు మరో నాలుగు గేట్ల నుంచి కూడా నీరు లీకవుతుండడంతో వచ్చే వేసవిలో ఇబ్బందులు తప్పవని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. గేట్లకు అనుకున్న సమయంలో మరమ్మతులు చేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిపేర్లు చేయకపోవడంతోనే అవి తుప్పుపట్టి వాటికి ఉన్న రబ్బర్లు ఊడిపోవడంతో లీకేజీలు ప్రారంభయ్యాయి.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్లే తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుపై ఇటు ప్రభుత్వం.. అటు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తున్నది. గేట్లకు మరమ్మతు సమస్యలున్నా వాటిని సరి చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సంఘటన జరిగినప్పుడే అధికారులు స్పందించి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ప్రాజెక్టు రోప్స్, రబ్బర్ సీల్స్, గ్రీజ్ తదితర పనులు చేపట్టి ప్రాజెక్టు భద్రతకు ముప్పు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
లీకేజీల వల్ల ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని జూరాల ప్రాజెక్టు ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. డ్యాం 32వ గేటు వద్ద రోప్ తెగిపోయి గేటు కింద పడడంతో కింద ఉన్న రబ్బర్సీల్స్ డ్యామేజీ కావడంతో నీరు లీకేజీ అయ్యిందని చెప్పారు. వెంటనే మరమ్మతులు చేపట్టామని వివరించారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం ఏ
గేట్ల వద్ద లీకేజీలు అవుతున్నాయో.. వాటిని మొదట తాత్కాలికంగా రిపేర్లు చేయిస్తామన్నారు. తర్వాత పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం పనులు పొందిన స్వప్న కన్స్ట్రక్షన్ త్వరలో చేపడుతారని తెలిపారు. లీకేజీలతో ఎటువంటి ఇబ్బంది లేదని, ఎలాంటి అపోహలు వద్దని సూచించారు.
– రహీముద్దీన్, ఎస్ఈ, జూరాల ప్రాజెక్టు