Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Markets) సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాలు సూచీలపై ప్రభావం చూపాయి. పశ్చిమ బెంగాల్ (West Bengal) లో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుండటం పాజిటివ్ సెంటిమెంట్‌కు కారణమైంది. అయితే ఓ దశలో వెయ్యి పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ (Senxex).. ఆ తర్వాత మోస్తరు లాభాలకే పరిమితం అయ్యింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 77,257.27 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77,910.75 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 355.90 పాయింట్ల లాభంతో 77,269.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121.75 పాయింట్ల లాభంతో 24,119.30 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.08 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్, ఎల్అండ్టీ, ఎటర్నల్ స్టాక్స్ రాణించాయి. భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలు చవిచూశాయి.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 113 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4545 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిచోట్ల స్పష్టమైన మెజారిటీలు రానుండటం మార్కెట్లకు జోష్ నిచ్చింది. స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పాటైతే మార్కెట్లు ఒడిదొడుకుల లోనయ్యే ప్రమాదం ఉండదు. ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంటే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతారు.