Stock Markets: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 11:15 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 73,475 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 83 పాయింట్లు తగ్గి 22,272 దగ్గర కొనసాగుతోంది.
సెన్సెక్స్-30 సూచీలో రిలయన్స్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, టైటన్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.
అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగియడం, ఇవాళ ఆసియా- పసిఫిక్ ప్రధాన సూచీలూ కూడా ప్రతికూలంగానే ఉండటం, బిట్‌కాయిన్, బంగారం ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.574.28 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,834.61 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.