ముంబై, మే 29: దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతోపాటు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూడటంతో వరుసగా నాలుగోరోజూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. వచ్చేవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలకానుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేకపోవడంతో మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపారు. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఒక దశలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 667.55 పాయింట్ల నష్టంతో 75 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 74,502.90 వద్ద స్థిరపడింది. ఈ నెల 27న సెన్సెక్స్ రికార్డు స్థాయి 76 వేలను అధిగమించిన విషయం తెలిసిందే. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 183.45 పాయింట్లు కోల్పోయి 22,704.70 వద్ద నిలిచింది. దీంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గత నాలుగు సెషన్లలో మదుపరులు రూ.5.12 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.5,12,921.96 కోట్లు కోల్పోయి రూ.4,15,09,713.94 కోట్ల(4.98 ట్రిలియన్ డాలర్లు) వద్ద నిలిచింది.