Smart City | హైదరాబాద్, జనవరి 4(నమస్తే తెలంగాణ): జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టడానికి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ముందుకురావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దీనికి అవసరమైన భూసేకరణ చేసినప్పటికీ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీకి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఎన్ఐసీడీపీ కింద కేంద్రం గతేడాది ఆగస్టులో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీనీ ప్రాజెక్టును మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా మంజూరైన ఈ స్మార్ట్‌సిటీ మొదటి దశలో రూ. 2,361 కోట్లతో 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టుతో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా. ఆటోమొబైల్, రవాణా, ఎలక్ట్రికల్ విడిభాగాలు, మెటల్స్-నాన్ మెటాలిక్ మినరల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణలో భాగంగా ప్లగ్ అండ్ ప్లే, వాక్ టూ వర్క్ విధానంలో ఈ స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్దేశించింది. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు సమతుల అభివృద్ధికి ఇది తోడ్పాటును అందించే అవకాశముంది. పీఎం గతిశక్తి నిబంధనల ప్రకారం ఇండస్ట్రియల్ ఇకోసిస్టం, స్కిల్డ్ వర్క్‌ఫోర్స్‌తో, విద్యా, వైద్య సదుపాయాలు, రవాణా వ్యవస్థతో కూడిన సమీకృత అభివృద్ధి, మంచినీరు, విద్యుత్, గ్యాస్, టెలికం, రోడ్డు, రైలు, ఎయిర్‌పోర్టు తదితరవాటి కనెక్టివిటీ, పర్యావరణానికి హాని కలుగని విధంగా వీటిని తీర్చిదిద్దాల్సివుంది.
కేసీఆర్ హయాంలోనే భూసేకరణ..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జహీరాబాద్, న్యాలకల్, ఝరాసంఘం మండలాల పరిధిలో సుమారు 13,500 ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్-జహీరాబాద్(నిమ్జ్) కోసం సేకరించాలని నిర్ణయించగా, అందులో 10 వేల ఎకరాల భూసేకరణ పూర్తయింది. దీనికి పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ప్రస్తుతం కేంద్రం మంజూరు చేసిన ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. మొత్తం రెండు దశల్లో, దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించే విధంగా ప్రతిపాదనలున్నాయి. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ) ఫ్రేమ్ వర్లో భాగంగా.. 3,245 ఎకరాల్లో మొదటి దశలో పనులు ప్రారంభించాల్సి ఉంది.
అనుకూలతలున్నా పడని ముందడుగు..
ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పూణె-మచిలీపట్నం జాతీయ రహదారికి(ఎన్‌హెచ్-65)కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతోపాటుగా నిజాంపేట్-బీదర్ రాష్ట్ర రహదారి(ఎస్‌హెచ్-16), జహీరాబాద్-బీదర్ రాష్ట్ర రహదారి(ఎస్‌హెచ్-14) సమీపంలోనే ఉన్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ పూర్తయితే సుమారు 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు పన్నుల రూపంలో ప్రభుత్వానికాదాయం సమకూరే అవకాశాలున్నాయి. అయినా ప్రభుత్వం దీనిపై ఉదాశీన వైఖరి ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీకి అవసరమైన పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికావర్గాలు చెబుతున్నాయి. ఇది ఎప్పటికి సాకారమవుతుందో వేచి చూడాల్సిందే.