తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను (Srivari Brahmotsavams ) విజయవంతంగా నిర్వహించామని , సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమష్టిగా, సమన్వయంతో సేవలందించాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( Chairman BR Naidu ) అన్నారు.తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
టీటీడీ సిబ్బంది సమన్వయం, ప్రణాళిక బద్ధంగా, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సేవలందించారని తెలిపారు. టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ట్వీట్ ద్వారా హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు 8 రోజుల్లో 5.80 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రూ.25.12 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని వివరించారు.
26 లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామన్నారు. బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించామని వెల్లడించారు . ఈ సమావేశంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, సదాశివ రావు, జానకి దేవి, జి.భానుప్రకాష్ రెడ్డి, శాంతా రామ్, నరేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు.