ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో యాదాద్రి ఆలయాలు, ఆ పరిసర వనాలు రూపుదిద్దుకొంటున్న తీరు గమనిస్తే, దేవదేవుల ఆకాంక్ష సాకారమవుతున్నదేమో అనిపిస్తున్నది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రభావవంతమైన పాత ఆలయం, మూల విరాట్టు, ఆంజనేయ, గరుడాళ్వారుల ఆలయాలు యథాస్థితిలో ఉంచి వాటికి ఉపాలయాలు చుట్టూరా నిర్మించి దాని పావిత్య్రాన్ని కాపాడుతూ సౌందర్యశోభితం చేశారు.
ఆకాశాన్ని చుంబించే గోపురాలు, విశ్వాన్ని ఆక్రమిస్తామన్నట్లున్న ప్రాకారాలు, సౌందర్యమంతా మాదేనన్న ప్రదక్షిణాపథాలు, స్వామి రథోత్సవానికి ఉపయోగపడే సువిశాల మాడవీధులు, సర్వత్రా స్వామియే సింహరూపంగా ఉన్నాడన్నట్లుండే తిష్ఠన్మూర్తులైన సింహాల శిల్పాలు పరాక్రమించి, పరిక్రమించేలా పరిక్రమలు, ఎన్ని అంతస్తులైనా ఎంత ఎత్తైనా ‘భూమిని మరిపించి, విమాన ప్రయాణికులు సమతల ప్రయాణమని భ్రమపడ్డట్టు’ సమతల అనుభూతులుగా భ్రమింపజేస్తూ నిర్మాణాలు – అసలు యాదాద్రి ఆలయం ఒక రాశీభూత సౌందర్యంగా భాసిస్తున్నది.
ఒక్కో కాలంలో ఒక్కో స్థలంలో ఒక్కో కళారీతి మనకు కట్టడాలలో కనిపిస్తుంది. కానీ యాదాద్రి ఆలయంలో అనేక కాలాల్లోని, వివిధ ప్రాంతాల కళారీతులను మేళవించారు. మధుర మీనాక్షిలోని చిలుక స్తంభాలు, కాకతీయులు ఉపయోగించిన బ్రహ్మకాంత స్తంభాలు, రోములో వాడిన రుద్ర స్తంభాలు- ఇలా భిన్న సంస్కృతులు, నాగరికతల మేళవింపుగా యాదాద్రి ఆలయం నయనానందంగా విలసిల్లింది.
సౌందర్య దర్శనం
యాదగిరి శ్రీనృసింహుడి గర్భాలయం ముందరి మంటప నిర్మాణం ఎంత చూసినా తనివి తీరదు. ఈ ఆలయ నిర్మాణంలో ప్రధాన శిల్ప నిర్మాణం ఇదే. భక్తులు క్యూ కాంప్లెక్స్‌ల నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే రెండతస్తుల ముఖ మంటపం కనిపిస్తుంది. పై అంతస్తులో ఉన్న కారణంగా ఒక రాజభవనం పై గవాక్షం నుంచి చూసినట్లు నమగ్ర సౌందర్య దర్శనమౌతుంది. అక్కడినుంచి స్వామివారి గర్భగుడికి ఇరువైపులా కాలి మెట్ల ద్వారా కిందికి దిగిరావాలి. ఈ కమనీయ దృశ్యం అంతా శిలానిర్మితం. ఆ విశ్వవిభుని మ్రోల సువిశాల సభా భవనంలో స్వామి సింహాసనస్తుడై కొలువు తీరగా, సాధువులు, సత్పురుషులు, ఆచార్యులు, భక్తులు.. ఒక సమ్రాట్టు దర్శనానికి సభలో వేచి ఉన్నట్టుగా కనిపిస్తుంది.
శిఖరాయమానం గోపుర సౌందర్యం
శిరస్సెత్తి చూస్తే శిఖరాయమానంగా కనిపించే గోపుర సౌందర్యం ఆలయానికి ప్రత్యేకత తెచ్చింది. నాలుగు దిశల్లో నాలుగు 55 అడుగుల ఎత్తున పంచతల గాలి గోపురాలు ఎత్తారు. ప్రచండ వాయుపీడనాన్ని తట్టుకొనేందుకు ఆ గోపురాలకు నేలనున్న ద్వారంతోపాటు పైన ఏర్పరిచిన గవాక్షాల సంఖ్యను బట్టి త్రితల, పంచతల, సప్తతల గోపురాలుగా మలిచారు. మిగిలిన ప్రాంతాల్లోని దేవాలయాల్లో గాలి గోపురాల బరువు ఎక్కువ కాకుండా ద్వారబంధంపై నుంచి ఇటుకలతో నిర్మాణాలు చేయడం సాధారణం. యాదాద్రి నారసింహుడి ఆలయ గోపురాల నిర్మాణంలో ఆకాశం అంచుల వరకు రాయినే వాడారు. ఆధునిక కాలంలో నిశ్చయంగా ఇదొక విశేష నిర్మాణం. రాయిని రాయిని అతికించేందుకు సంప్రదాయపద్ధతిలో బెల్లం, జనపనార, కరక్కాయ, కలబంద, సున్నం, నీటి మిశ్రమాన్ని వాడారు. రాళ్ల మధ్య పెద్ద అంతరాలను తొలగించడానికి సీసాన్ని కూడా వినియోగించారు.
సిమెంట్ మచ్చుకైనా వాడలేదు. రెండేరెండు గోపురాలతో ఉన్న పాత దేవాలయం నేడు నలువైపుల ఏడు గోపురాలతో అలరారుతున్నది. అస్సాం నుంచి వచ్చిన కర్రదుంగ శ్రేష్ఠమైన వృక్ష స్కంధంతో నిటారుగా 34 అడుగుల సమున్నత దారు ధ్వజంతో ధ్వజస్తంభంగా గర్వంగా నిలుస్తున్నది. దీనికి ఏర్పాటైన వితర్థిక శిలా నిర్మితమే, శిల్పశోభితమే. పడమటి గోపురం సప్తతల గోపురంగా 72 అడుగులతో నిర్మితమైంది. నాలుగు దిశల్లో 55 అడుగులతో పంచతల, ఈశాన్యంవైపు 33 అడుగుల త్రితల గోపురాన్ని నిర్మించారు. మొత్తం సప్త గోపురాలతో సప్తగిరులవలె శోభిస్తున్నది. ఆలయంలో కుడ్యాలపై, స్తంభాలపై చెక్కిన దేవతామూర్తుల సంఖ్య 541. బాహ్యాంతః ప్రాకారాల కుడ్యాలపై, స్తంభాలపై రామాయణ, మహాభారత ఇతిహాసాల దృశ్యాలు చెక్కించారు. ఇది దక్షిణాది ఆలయాల సాదృశ్యంతో చేసింది. పడమటి మహాగోపురం బృహదీశ్వరాలయంలా సమస్త శిలానిర్మితం. ఎనిమిది వందల శిల్పుల సామూహిక స్వప్నం ఈ ఆలయం.
ముఖమంటపం శిల్ప శోభితం
నిలువెత్తుగా రెండంతస్తులుగా శిల్పశోభితమైన ముఖమంటపం, స్వామివారికి చక్రవర్తి సభా మంటపంలా శోభిల్లుతున్నది. నిజానికి ఈ నిర్మాణం కత్తిమీద సాము, రూపకర్తల (డిజైనర్స్) మేధకు పరీక్ష. కారణం స్వామివారి మూల విరాట్టును, దానికి ఆనుకొని ఉన్న కొండను, నృసింహుడు విరాజమానమైన గుహ పవిత్రతను కాపాడుతూ, సవరణలేవీ లేకుండా దాన్ని కలుపుకొని నిర్మాణాలు చేయడం కష్టకార్యం. క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి ఉపాలయాన్ని, గరుడాళ్వారు ఆలయాన్ని, యథాతథంగా ఉంచుతూనే సువిశాల ముఖమంటప నిర్మాణం సాగింది. పై అంతస్తులో తూర్పున స్వామికి అభిముఖంగా, తంజావూరు చిత్రాలతో పురాణగాథలతో చిత్రశాల నిర్మించారు. కుడి వసారాలో భక్తులు వేచి ఉండేందుకు, ఎడమ వసారాలో స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపునకు విశాలంగా నిర్మించారు. శయన మంటపం భక్తుల దర్శనార్థం ఉత్తర ప్రదక్షిణపథంలో నిర్మించారు.
రామానుజులకు, ఆండాలు అమ్మవారికి ఉపాలయాలు నిర్మాణం జరిగాయి. అన్ని స్తంభాలకు నాలుగు వైపుల శిల్పాలతోపాటు మంటపానికి ముఖంచేసి కొలువు తీరినట్టు పన్నిద్దరాళ్వారుల విగ్రహాలు రెండు అడుగుల ఎత్తులో ప్రారంభించి తొమ్మిది అడుగుల ఎత్తులో శిల్పీకరించారు. పెరియాళ్వార్ (విష్ణుచిత్తుడి) విగ్రహానికి పక్కగా చిన్నగా ఆయనను అంటుకొని ఆయన కూతురు గోదాదేవి (ఆముక్తమాల్యద)ని శిల్పీకరించారు. యాదఋషి, గోదాదేవిని నిలిపారు. ఇదంతా (స్తంభం) ఏకశిలా నిర్మితం. కాకతీయ శైలితో స్తంభపు పలకలు, వాటిపై విగ్రహాలు, ఇలా పన్నెండు స్తంభాలతో, ఆళ్వారులు స్వామి వారి ముందట కొలువు తీరి ఉన్నారా? అన్న అనుభూతిని కల్గిస్తుంది. ఈ యాదగిరి దేవస్థానానికి ప్రత్యేకమైన పంచనారసింహ రూపాలైన ఉగ్ర, యోగ, లక్ష్మీ, గండభేరుండ, జ్వాలా నారసింహుల విగ్రహాలను ప్రత్యేకంగా ముఖమంటపానికి తూర్పునకు ముఖంచేసి చెక్కినారు.
శిల్పాలలో ప్రహ్లాద చరిత్ర
స్వామి గర్భగుడికి ఉభయ పార్శాలలో జయ విజయుల విగ్రహాలు చెక్కినారు. ఇవి 8 అడుగుల ఎత్తు గలవి. ఇవి మొత్తం ఆరు విగ్రహాలు చేయించారు. మూడు ద్వార బంధాలకు ఇరుపక్కలా ఉంటాయి. చండప్రచండులని వీరికి ఉపనామాలు. స్వామి హిరణ్యకశిపు వధకై అవతరించడానికి సనకసనందన, సనత్సుజాది పంచ బ్రహ్మమానస పుత్రులను వైకుంఠుని దర్శన సందర్భాన అవమానించినందుకే వారి శాపాలతో వీరు రాక్షసులై పుట్టి నరసింహావతారానికి కారణమయ్యారన్న పురాణోక్త దశావతార గాథా విషయాన్ని గుర్తు చేసికోవాలి. భీకరమైన ఎనిమిది అడుగుల భారీ ద్వారపాలక విగ్రహాలకు పైన ప్రహ్లాద చరిత్రను ఐదు చిత్రపటాలుగా శిల్పీకరించారు. వీటికి ఇత్తడి తొడుగులు వేసి కన్నులు కట్టేలా చేసారు. క్యూవరుసల్లో ఉన్నా భక్తులు తమ పిల్లలకు ప్రహ్లాద చరిత్ర పురాణగాథను కథగా, దృశ్యమానం చేస్తూ చెప్పవచ్చు. ఇదొక ఆకర్షణీయాంశం. ఇక్కడ ప్రతి అంగుళం శిల్పమయమే.
గర్భాలయ ద్వారాలు పాతవి ఏడు అడుగుల ఎత్తువి కాగా నేటి తలుపులు 15 అడుగుల ఎత్తుతో విశాలమైన ద్వారబంధాలతో 8 అడుగుల తలుపులతో చక్కని దేవదారు(టేకు) వృక్షపు కఱ్ఱతో సునిశితంగా, నైపుణ్యంతో నిర్మాణమయ్యాయి. వీటి చెక్కడపు పనితనం చెదరకుండా బంగారు తొడుగులు అమర్చినారు. ద్వారబంధాలు తెరువక ముందు స్వామివారి ముందు నిలిచి ఉన్న భక్త జనాళికి ఇవి కన్నుల పండువగా ఉంటాయి. తెరిచిన తరువాత స్వామివారి దర్శనాకాంక్షలో గల భక్తులకు దృష్టికి అడ్డురాకుండా పక్కకు ఒదుగుతాయి.
మహాబలిపురం గజాకృతులు
ఈ గోపుర ద్వారాలకు ముందు ఉభయ పార్శాలలో తూర్పు పడమర ద్వారాలకు ఏనుగులు, ఉత్తర దక్షిణ ద్వారాల ఉభయ పార్శాలలో సింహాలను అందంగా గండశిలలపై శిల్పీకరించి, వాటి అనుమతిలేక లోనికి ప్రవేశించరాదన్నట్లు గంభీరంగా ద్వారశోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఈ ఏనుగులు మహాబలిపురంలోని గజాకృతిలో ఉన్నాయి. ఇవి అక్కడే చేసి తెప్పించబడ్డాయి. వీటి పృష్ఠ భాగాలపై నగిషీలు, నునుపుదనం చేయడంవల్ల నల్లని ఏనుగులుగా దర్శనమిస్తున్నాయి. వీటి నిర్మాణానికి కృష్ణశిలలను వాడారు. మొత్తం సప్తద్వారాలు ఆలయావరణకు బహిరలంకారంగా నిలిచాయి. గర్భాలయంపై నిర్మించిన విమానగోపురం 45 అడుగుల ఎత్తులో అష్టభుజిగా నిర్మించబడింది. దీనికి స్వర్ణకవచం తొడుగుతున్నారు.
స్వర్ణ గోపురం
యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వరతాపడంతో ధగధగలాడబోతున్నది. ఇందుకోసం భక్తులు భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఇతరత్రా స్వర్ణ తాపడాలకూ విరాళాలు అందుతున్నాయి. ఒక భక్తుడు బంగారం కానుకగా ఇవ్వడంతో నృసింహుడికి స్వర్ణ కవచం ఏర్పాటయింది. గర్భాలయ ద్వార తలుపులు కూడా 16 కిలోల స్వర్ణతాపడంతో శోభిల్లడం విశేషం. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం టేకు తలుపులకు రాగి, కాంస్యంతో ఎంబాజింగ్ చేపట్టారు. దిగువన ఆరు బంగారు బాతులను, వాటి మధ్య 36 తామర పుష్పాలను తీర్చిదిద్దుతున్నారు. పెంబర్తి కళాకారులతో వెయ్యి కిలోల వెండి, రెండు వేలకిలోల ఇత్తడిని ఉపయోగించి ఆలయ ద్వారాలకు తొడుగులను తయారు చేయిస్తున్నారు. యాదగిరీశుడి ఆలయ శిల్ప నిర్మాణ వైభవాలు, స్వామి మహిమల మాదిరిగానే, వాక్కుతో వివరించలేం. యతోవాచో నివర్త్యతే అప్రాస్యమనసా సహ అన్నట్లు.. ఒక బృహదీశ్వరాలయం, ఒక కంచి, ఒక చిదంబరం ఇలా ఆలయాల వైభవాలు, వాటి నమూనాలు, వాటి శిల్పసౌందర్యాలు, వాటి బృహద్గోపురాలు, అన్ని కలగలిపి, ఆధునిక సౌకర్యాలు మేళవించి యాదాద్రి నృసింహాలయ నిర్మాణం జరిగింది. పునాది నుంచి గోపురాల వరకు కృష్ణ శిలతో నిర్మించిన ఏకైక ఆలయమిది. అంతర్జాతీయంగా ఐఎస్వో సర్టిఫికెట్ సాధించిన ఏకైక ఆలయంగా నిలుస్తున్నది.
డాక్టర్ సంగనభట్ల నరసయ్య
9440073124
drsnarsaiah@gmail.com