కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఏప్రిల్ 04 : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని యువతను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే క్రీడా మైదానాల అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువత ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. యువతతో కలిసి ఎంపీ మైదానంలో క్రికెట్ ఆడి ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కార్పొరేటర్లు సింధు తపస్వి, సాగర్, సర్పంచులు శ్రీకాంత్, జయరాం, నాయకులు శ్రీకాంత్, రమాకాంత్, బి.శ్రీనివాస్, కన్ని రాజేష్, మిట్టపల్లి కిరణ్ పాల్గొన్నారు.

క్రీడలతో శారీరక, మానసిక ధృఢత్వం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర