హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ( Harish Rao ) తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని, ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని ఆరోపించారు.
పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందని మండిపడ్డారు.ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా?. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటని అన్నారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ఒకవైపు ‘ హేట్ స్పీచ్ బిల్ ’ పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ, మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన? అంటూ నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యమని చెబుతూ గూండా రాజ్యం అమలు చేస్తారా? అని అన్నారు . సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికి వదిలేసారని విమర్శించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే, ఇక్కడ పాలనను ఎవరు చూస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారు. మీ అణచివేతలకు, నిర్బంధాలకు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు, బెదరదని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటమని వివరించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీకి డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.