హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తనకు అడ్డువస్తారనుకున్న ఎవ్వరినీ రాష్ట్ర ముఖ్యనేత వదిలిపెట్టడంలేదు.. నయానో భయానో తన దారికి తెచ్చుకునేందుకు ఆయన తన అస్ర్తాలన్నీ ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని కొందరు కీలక మంత్రులపై ఉపయోగించిన ఫార్ములానే పీసీసీలోని కీలకనేతపై ప్రయోగించినట్టు తెలిసింది. ఇప్పుడా కీలకనేత ఎవరికీ చెప్పుకోలేక.. ఏమీ అనలేక గిలగిల కొట్టుకుంటున్నట్టున్నారు. కరడుగట్టిన కాంగ్రెస్ నేత అయిన ఆయన.. పార్టీలోకి వలస వచ్చిన వారి ప్రాబల్యం, పెత్తనంపై ఇక చూసీచూడనట్టు వ్యవహరిస్తానంటూ ప్రభుత్వంలోని ముఖ్యనేతతో రాజీ రాయబారం నడుపుతున్నారు. ఇంటెలిజెన్స్ శాఖ నుంచి సేకరించిన వివరాలు బయటకు వస్తే తన పరువు,
తన కొడుకు పరువు గోదాట్లో కలుస్తుందని, పరస్పరం సీజ్ఫైర్ ప్రకటిద్దామంటూ సదరు నేత ప్రతిపాదించినట్టు తెలిసింది. త్వరలోనే ప్రభుత్వంలోకి వస్తానని, ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని కలలుగన్న ఆ నేత ఇప్పుడు పరువు దక్కితే చాలనుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. తనపై, తన కొడుకుపై రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యనేత పెట్టిన నిఘాపై ఎవ్వరికీ చెప్పుకోకపోయినా తనను ఇబ్బందిపెట్టాలనుకున్న ముఖ్యనేత ‘నీడ’ తనకు అనుకూలంగా ఉండే ‘పెద్ద టీవీ’ చానల్లో ఘెరంగా కథనాలు రాయించిన విషయం తెలిసిందే. కథనాలు కూడా రావడంతో ఆయన మరింత భయపడ్డాడు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌గా ఉన్న ఆయన పీసీసీలో ముఖ్యస్థానం సంపాదించిన తర్వాత కొంతకాలం అంతా సవ్యంగానే సాగింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యనేత వలస కాంగ్రెస్‌ను ప్రోత్సహించడం, పాత కాంగ్రెస్‌ను పట్టించుకోక పోవడంతోపాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై పార్టీ అధిష్ఠానం అప్పుడప్పుడు ఇక్కడి నేతలతో ఆరా తీసింది. ఈ క్రమంలోనే పీసీసీ కీలకనేతను కూడా ఆరా తీసింది. పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తుండటంతో ఆయన ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని అధిష్ఠానానికి చెప్పాడు.
అధిష్ఠానంలోని కోవర్టు ఆ విషయాన్ని ప్రభుత్వ ముఖ్యనేతకు చేరవేయడంతో ఇక అప్పటి నుంచి ముఖ్యనేత ఆయనపై పగబట్టాడు. నిఘా వర్గాలకు చెప్పి పీసీసీ నేత కదలికలను తెలుసుకుంటూ వస్తున్నాడు. ప్రతి కదలికను రికార్డు చేయించాడు. వారంలో కనీసం ఒక్క రోజైనా ఎల్బీనగర్కు ఆయన వెళ్లడం, లక్డీకాపూల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు ఆయన వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీని కూడా సేకరించినట్టు తెలసింది. దాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వ నేత పీసీసీ నేతను హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతున్నది. అంతే కాదు.. ఆయన కొడుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. దీనికి సంబంధించి నార్సింగి పరిధిలో ఓ వివాదం జరిగింది.
ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకొని పీసీసీ నేతను ప్రభుత్వ ముఖ్యనేత ‘షాడో’ బెదిరించినట్టు తెలిసింది. ఈ వివాదంలో స్థానికంగా పీసీసీ నేతకు దగ్గరగా ఉండే పోలీసు అధికారిపై కూడా గురిపెట్టారు. ఆయనపై ఏసీబీ దాడులు చేయిస్తామని కూడా బెదిరించారు. కొడుకు రియల్ ఎస్టేట్ దందా బందుపెట్టించాలని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఈ వివాదం నుంచి ఇప్పుడిప్పుడే ఆయన గట్టెక్కుతున్నాడు. సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టడం దుర్మార్గమని, తమను బెదిరించి లొంగదీసుకుంటున్నారంటూ తనకు దగ్గరగా ఉండే ఓ నేత వద్ద వాపోయినట్టు తెలిసింది.