ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ విభాగంలో ఆసుస్ సంస్థ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఈ రంగంలో తన ఉనికిని మరింత విస్తరిస్తూ.. సరికొత్త ‘ఆసుస్ ప్యాడ్’ను తీసుకొచ్చింది. ఎంటర్టైన్మెంట్, ప్రొడక్టివిటీతోపాటు క్రియేటివ్ పనుల కోసం రూపొందించిన ప్రీమియం ట్యాబ్లెట్ ఇది. దీనిని త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు ఆసుస్ తాజాగా ప్రకటించింది.
ఈ అత్యాధునిక ట్యాబ్లెట్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే.. సన్నని, తేలికపాటి డిజైన్ దీని సొంతం. ఇందులో 12.2 అంగుళాల 2.8కె OLED డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఎండల్లోనూ ఇబ్బంది లేకుండా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాసెసర్-స్టోరేజ్ విషయానికి వస్తే.. మీడియాటెక్ డీ8300 ప్రాసెసర్, అత్యాధునిక 8జీబీ ఎల్పీడీ డీఆర్5ఎక్స్ ర్యామ్ ఉంది. ఏఐ ఆధారిత పనులను ఎలాంటి ల్యాగ్ లేకుండా చిటికెలో చేసి పెడుతుంది.
బ్యాటరీ-చార్జింగ్ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్టుగా.. 9,000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 0% నుంచి 50% వరకు చార్జ్ అవుతుంది. ఫొటోల కోసం 13 ఎంపీ రియర్ కెమెరా, వీడియో కాల్స్ కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. పాటలు వినడానికి డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లు, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ-సి, ఆండ్రాయిడ్ 16, ‘ఆసుస్ పెన్ 2.0’ స్టయిలస్ సపోర్ట్ లాంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
ఇందులోని గ్లయిడ్ ఎక్స్ ఫీచర్ సాయంతో విండోస్, మ్యాక్ ఓఎస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల మధ్య ఫైళ్లను సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఈ ఆసుస్ ప్యాడ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ. 45,990 కాగా, 8జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ. 49,990గా నిర్ణయించినట్లు ఆసుస్ ప్రకటించింది.