రాజాపేట, ఫిబ్రవరి 03 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల గ్రామాలలో పులి సంచరిస్తున్నందున పులిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలపై అటవీ అధికారులతో కలెక్టర్ చర్చించారు. అటవీ అధికారులు పులిని పట్టుకోవడానికి ధర్మల్ డ్రోన్‌ను ఉపయోగించి పులి సంచరిస్తున్న ప్రదేశాలను వీడియో తీయడం, ట్రాప్ కెమెరా, పులిని బంధించడానికి బోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అటవీ శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ప్రత్యేకంగా అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని తెలిపారు.
రాత్రి వేళలో పశువులను బయటికి వదలకుండా పశువుల పాకలో వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయరాదన్నారు. జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ సిబ్బంది పులి అడుగు జాడలను గమనిస్తూ, దాన్ని పట్టుకోవడానికి, అడవిలోకి పంపడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట డీఎఫ్ఓలు సుధాకర్ రెడ్డి, పద్మజ, రాజాపేట బీట్ అధికారి నిఖిత ఉన్నారు.