అర్వపల్లి, ఫిబ్రవరి 03 : ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉధ్దేశ్యంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన ‘మిషన్ 10వ తరగతి’ పోస్టర్ ను మంగళవారం అర్వపల్లి జడ్పీహెచ్ఎస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ బందెల భరత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మిషన్ 10వ తరగతి కార్యక్రమం అభినందనీయమన్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు గొప్ప ప్రోత్సాహానిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.2.2 కోట్ల నగదు బహుమతులను విద్యార్థులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి స్థానాన్ని పొందిన విద్యార్థికి రూ.5 లక్షలు, రెండవ స్థానం రూ.3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్‌కు రూ.2 లక్షలు, అలాగే 119 అసెంబ్లీ స్థానాలకు ప్రతి నియోజకవర్గ టాపర్ కు రూ.1 లక్ష చొప్పున, అలాగే 612 మండలాల్లో టాపర్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట డెవలప్మెంట్ ఆఫీసర్ కుంభం సురేందర్, విజిట్ మేనేజర్ యుగంధర్, సెల్స్ ఆఫీసర్ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.