హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలలు (భవిత కేంద్రాలు)లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు కూడా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత ఉండాల్సిందేనని శుక్రవారం హైకోర్టు స్పష్టంచేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్, సూల్ అసిస్టెంట్ టీచర్ల క్యాడర్లలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకంలో టెట్ అర్హత నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ దాఖలైన మూడు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేంద్ర పునరావాస మండలి నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక టీచర్లకు టెట్ అర్హతను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 4 రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్సీటీఈ ప్రకారం ప్రత్యేక టీచర్లకు టెట్ ఉండాల్సిందేనని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఆగిన ప్రత్యేక టీచర్ల నియామకాలను కొనసాగించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.