మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. టీ20 సిరీస్‌నూ ఓటమితోనే ప్రారంభించింది. వర్షం కారణంగా రైద్దెన తొలి టీ20లో మెరుపులు మెరిపించిన భారత టాపార్డర్.. రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు.. భారత్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తుచేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కంగారూల తురుపు ముక్క జోష్ హాజిల్‌వుడ్ (4-0-13-3) ధాటికి భారత టాపార్డర్ కుదేలైంది.
అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత్ రాణా (33 బంతుల్లో 35, 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో టీమ్ఇండియా 18.4 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఛేదనను ఆసీస్ 13.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి దంచేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 46, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 28, 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. హాజిల్‌వుడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఆదివారం హోబర్ట్‌లో జరుగుతుంది.
టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న టీమ్ఇండియా.. మరోసారి ప్రయోగాల బాట పట్టి చేతులు కాల్చుకుంది. దీనికి తోడు హాజిల్‌వుడ్ పదునైన పేస్‌కు టాపార్డర్ కకావికలమైంది. తన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన అతడు.. రెండో ఓవర్లో గిల్ (5)ను ఔట్ చేసి పర్యాటక జట్టుకు తొలి షాకిచ్చాడు. ఇక మూడో నెంబర్లో ఎవర్ని ఆడించాలనేదానిపై తర్జనభర్జన పడుతున్న టీమ్ఇండియా.. గత మ్యాచ్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకు బదులు వికెట్ కీపర్ సంజూ శాంసన్ (2)ను పంపినా ఆ ప్రయోగం బెడిసికొట్టింది. ఎల్లీస్ 4వ ఓవర్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ వేగంగానే ఆడాడు. కానీ ఐదో ఓవర్లో హాజిల్‌వుడ్.. సూర్య (1), తిలక్ వర్మను డకౌట్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టాడు.
బార్ట్లెట్ బౌలింగ్‌లో అభిషేక్‌తో సమన్వయ లోపం కారణంగా అక్షర్ పటేల్ (7) రనౌట్ అవడంతో 49 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో శివమ్ దూబేకు బదులు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత్.. వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే గాక అభిషేక్‌తో ఆరో వికెట్‌కు కీలకమైన 56 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో కీలకపాత్ర పోషించాడు. రాణా అండతో అభిషేక్ 23 బంతుల్లో తన ఆరో అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. ఇన్నింగ్స్ కుదురుకుంటున్న తరుణంలో బార్ట్లెట్.. 16వ ఓవర్లో రాణాతో పాటు దూబె (4)ను ఔట్ చేసి జట్టును మళ్లీ కష్టాల్లోకి నెట్టాడు. అభిషేక్ సైతం నిష్క్రమించడంతో భారత ఇన్నింగ్స్ కథ ముగిసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్, రాణా మినహా మిగిలిన 9 బ్యాటర్లు చేసిన పరుగులు 19 మాత్రమే. ఏకంగా 9 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం భారత్ కొంపముంచింది.
స్వల్ప ఛేదనను ఆసీస్ ఓపెనింగ్ ద్వయం ధనాధన్ ఆటతో భారత్‌కు ఉన్న కొద్దిపాటి అవకాశాలనూ దూరం చేసింది. రాణా, బుమ్రా బౌలింగ్‌ను ఈ జోడీ అలవోకగా దంచేసింది. ప్రమాదకర హెడ్.. రాణా నాలుగో ఓవర్లో 6, 4 బాదగా మార్ష్ సైతం సిక్స్‌తో హోరెత్తించాడు. వరుణ్ చక్రవర్తి రాకతో హెడ్ నిష్క్రమించినా కుల్దీప్ 8వ ఓవర్లో మార్ష్.. 4, 6, 4, 6తో మ్యాచ్‌ను తమవైపునకు లాగేసుకున్నాడు. డేవిడ్ (1), ఒవెన్ (14), షార్ట్ (0) విఫలమైనా స్టోయినిస్ (14*) లాంఛనాన్ని పూర్తిచేశాడు. మరో 40 బంతులు మిగిలుండగానే ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.
1 2008 తర్వాత మెల్బోర్న్లో ఒక టీ20 మ్యాచ్‌లో ఓడటం భారత్‌కు ఇదే ప్రథమం.
భారత్: 18.4 ఓవర్లలో 125 ఆలౌట్ (అభిషేక్ 68, హర్షిత్ 35, హాజిల్‌వుడ్ 3/13, ఎల్లీస్ 2/21);
ఆస్ట్రేలియా: 13.2 ఓవర్లలో 126/6 (మార్ష్ 46, హెడ్ 28, వరుణ్ 2/23, బుమ్రా 2/26)