Mike Procter : దక్షిణాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ మైక్ ప్రొక్టెర్(Mike Procter) కన్నుమూశాడు. గుండె సర్జరీ (Heart Surjery) సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న అతడు 77 ఏండ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. ప్రపంచంలోని గొప్ప ఆల్రౌండర్లలో ఒకడిగా తన ముద్ర వేసిన మైక్ మరణవార్తతో దక్షిణాఫ్రికా క్రికెట్లో విషాదం నెలకొంది.
దక్షిణాఫ్రికా గొప్ప క్రికెటర్లలో ఒకడిగా పేరొందిన మైక్ కెరీర్ 1970- 1980 మధ్య కాలంలో ప్రశ్నార్థకంగా మారింది. దాంతో మీడియం పేసర్ అయిన మైక్ దేశం తరఫున 7 టెస్టులు మాత్రమే ఆడాడు. అది కూడా ఆస్ట్రేలియా మీదనే కావడం విశేషం. ఈ ఏడు మ్యాచుల్లో 41 వికెట్లు తీశాడు.
మైక్ ప్రొక్టెర్
ఇక కెరీర్లో 410 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన మైక్ 21,936 రన్స్ కొట్టాడు. అందులో 48 సెంచరీలు ఉన్నాయి. బంతితోనూ సత్తా చాటుతూ 1,417 వికెట్లు నేలకూల్చాడు. అంతేకాదు రికార్డు స్థాయిలో 70 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
క్రికెటర్‌గా కెరీర్ ముగిశాక మైక్ మ్యాచ్ రిఫరీగా కొత్త అవతారమెత్తాడు. అయితే.. రెండు పర్యాయాలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. 2006లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడనే కారణంతో పాకిస్థాన్‌కు పెనాల్టీ విధించాడు. అంతేకాదు 2008లో సిడ్నీ టెస్టులో రేసిజం వ్యాఖ్యల కారణంతో భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించాడు. అనంతరం అతడు దక్షిణాఫ్రికా సెలెక్టర్స్ కన్వీనర్‌గా నియమితులయ్యాడు. మైక్ కొన్ని రోజుల క్రితం గుండెకు సర్జరీ చేయించుకున్నాడు. అయితే.. సర్జరీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతున్న అతడు శనివారం ప్రాణాలు విడిచాడు.