కుభీర్ : మండలాన్ని గత వారం రోజులుగా పొగ మంచు (Smog) కమ్మేస్తుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పొగ మంచు కారణంగా వాహనదారులు రోడ్డు వెంబడి దారి కనబడకుండా పోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కుభీర్ ( Kubeer ) మండలంలో చలి తీవ్రత అధికంగా ఉండడంతో రాత్రి 8 గంటలు దాటితే ఆయా గ్రామాల్లోని ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. వారం, పది రోజులుగా చలి తీవ్రతతో పాటు పొగ మంచు కురుస్తుండడంతో రైతులు ఉదయం వేళలో చేలకు వెళ్లడం మానేశారు. ఎండ వచ్చిన తరువాతనే పొలాల బాట పడుతున్నారు.
మండలంలోని రైతులు యాసంగి పంటలైన శనగ, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. అంతర పంటగా వేసుకున్న కంది పంట పొగ మంచు కారణంగా పురుగు ఉధృతి ( Insect infestation) పెరిగిందని పేర్కొన్నారు. దీంతో పంటలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగ మంచుతో పంటలకు చీడ పీడలు ఆశీంచకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏఈవోలు రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.