Manchu Manoj | టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించారు. ఈసారి సినీ సెట్లో కాదు… సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన కొత్త మ్యూజిక్ లేబుల్ ‘మోహన రాగ మ్యూజిక్’ శనివారం అధికారికంగా లాంచ్ అయింది. చాలా ఏళ్లుగా తన మనసులో దాగి ఉన్న ఈ కల నేడు నెరవేరిందని మనోజ్ భావోద్వేగంగా వెల్లడించారు. ట్విటర్లో ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో ఓ సరికొత్త సంగీత సంస్థను ప్రారంభించబోతున్నట్టు చెప్పుకొచ్చారు మంచు మనోజ్. మ్యూజిక్ అంటే తనకు ఎంతో ఇష్టమని… ఈ సంస్థ ద్వారా న్యూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించనున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
సంగీతం ఎల్లప్పుడూ నా ఎస్కేప్. నా ఎక్స్ప్రెషన్, నా నిజం. ఈ రోజు ఆ జర్నీ డెవలప్ అవుతోంది. నా కొత్త ప్రపంచ మ్యూజిక్ వెంచర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మోహన రాగ మ్యూజిక్… యంగ్ టాలెంట్, కరేజ్, నిర్భయమైన సృజనాత్మక కోసం నిర్మించాం అని మంచు మనోజ్ స్పష్టం చేశాడు. నటుడిగా ఎన్నో సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సంపాదించిన మనోజ్, సంగీతంపై కూడా మంచి పట్టు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. పోటుగాడు సినిమాలో “ప్యార్ మే పడిపోయా” పాటను స్వయంగా పాడారు. కరోనా సమయంలో విడుదల చేసిన “అంతా బాగుంటాండ్రా” పాటకు విపరీతమైన స్పందన వచ్చింది అంతేకాదు పిస్తా పిస్తా, ఎన్నో ఎన్నో, ప్రాణం పోయే బాధ వంటి పాటలకు లిరిక్స్ కూడా రాశారు.
అతని స్వరంలో ఉండే సహజమైన ఎమోషన్, సంగీతాన్ని వ్యక్తీకరించే తీరు ప్రత్యేకమని ఆయన అభిమానులు అప్పుడప్పుడూ చెబుతుంటారు. మనోజ్ తండ్రి డాక్టర్ మంచు మోహన్ బాబు, అన్న మంచు విష్ణు, అక్క లక్ష్మీ మంచు సినిమాలకు సంగీతం, యాక్షన్ విభాగాల్లో కూడా పనిచేసిన విషయాన్ని మనోజ్ గుర్తుచేశారు. హాలీవుడ్ చిత్రం Basmati Blues కోసం సంగీత దర్శకుడు అచ్చు రాజమణితో కలిసి పనిచేయడం ఆయనకు మరో పెద్ద మైలురాయి. “మోహన రాగ” అనే పేరుకు తనకూ, తన కుటుంబానికీ ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సహకారంతో రూపొందుతున్న తొలి ప్రాజెక్టుల్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. తెలుగు సంగీతాన్ని ప్రపంచానికి మరింత దగ్గర చేయడమే తన ఆశ అని మనోజ్ పేర్కొన్నారు.