ఆదిలాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పత్తి, సోయాబీన్ కొనుగోళ్లలో సీసీఐ, మార్క్ఫెడ్లు కొర్రీలు పెట్టడంపై కర్షకులు, అఖిలపక్షం నాయకులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-44పై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా, ఆయా ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనాలు, బైక్‌లు, ఎండ్లబండ్లలో వచ్చి మండుటెండలో రోడ్డుపై బైఠాయించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ వెంట జొన్న (సద్ది) రొట్టెలు తెచ్చుకోగా, మాజీ మంత్రి జోగు రామన్న, ఆయా పార్టీల నాయకులు తింటూ నిరసన తెలిపారు.
ఆపై రైతులు మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో పత్తికి క్వింటాలుకు రూ.8110, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సోయాకు క్వింటాలుకు రూ.5328 చొప్పున మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, మార్కెట్ యార్డుకు పత్తి, సోయాబీన్ అమ్మకానికి తీసుకొస్తే నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదంటూ మండిపడ్డారు. ఇకనైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా పత్తి, సోయా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆందోళన చేపట్టడంతో ఇరు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఆందోళనలు మరింత ఉధృతం చేస్తాం : అఖిలపక్షం నాయకులు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నాయని అఖిలపక్షం నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి కార్పొరేట్ కంపెనీలు దిగుమతి చేసుకునే పత్తిపై కేంద్రం 11 శాతం సుంకం ఎందుకు ఎత్తివేసిందని ప్రశ్నించారు.
తేమ ఎక్కువ ఉందని సీసీఐ పత్తి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నదని, జిల్లాలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు సహజంగా తేమ శాతం ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు చేసేదేమి ఉంటుందని ప్రశ్నించారు. అలాగే కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపడుతుండగా, రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇకనై నా రైతుల సమస్యలు పరిష్క రించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బండి దత్తాత్రి, మల్లేశ్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ నాయకులు శ్రీనివాస్, నంది రామయ్య, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెం బొర్రన్న, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఏం చేసినట్టు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు నెల రోజులుగా పత్తి, 20 రోజులుగా సోయాబీన్ పంటల కొనుగోళ్లు జరుగుతున్నాయి. రైతులు నష్టపోతున్నా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కలువడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
ఇన్ని రోజుల నుంచి పత్తి, సోయాబీన్ రైతులు ఆందోళనలు చేస్తున్నా ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల కొనుగోళ్లలో ఇప్పటికైనా నిబంధనలు ఎత్తి వేయాలి. పత్తిలో తేమ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఎకరాకు 13 క్వింటాళ్లు కొనాలి. రైతుల వేలిముద్రలతో సంబంధం లేకుండాసోయాబీన్ సేకరించాలి.
ఇంత గోస ఎప్పడూ పడలే
పత్తి అమ్మడానికి ఎప్పుడూ ఇంత గోస పడలే. ఫోన్లో కపాస్ కిసాన్యాప్లో బుక్ చేసుకొని పత్తిని అమ్మాలంటే మాలాంటి రైతులకు ఇబ్బందైతుంది. చదువుకోని రైతులు, పెద్ద ఫోన్‌లేని వాళ్లు ఏం చేసుడు. పత్తిలో తేమ ఎక్కువ ఉందని కొంటలేరు. చలి బాగా ఉండి మంచు పడుతున్నది. దీనికి రైతును ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు కరెక్టు. ఎండిన పత్తిని కూడా సీసీఐ వాళ్లు కొంటలేరు.
– రాజన్న, రైతు, చాంద, ఆదిలాబాద్ రూరల్ మండలం
స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెబుతాం
తాంసి, నవంబర్ 21 : తాంసి మండలంలోని జామిడిలో నాలుగు ఎకరాల్లో పత్తి పండించిన వర్షాలతో దిగుబడి రాలే. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలే. మొన్నటిదాకా యూరియా దొరకలే. ఇప్పుడేమో తేమ సాకుతో పంట వాపసు చేసిన్రు. ఇగ చేసేదేమీ లేక అగ్గువకు ప్రైవేటోళ్లకు అమ్ముతున్నాం. రైతుల కండ్లలో కన్నీళ్లు నింపిన కాంగ్రెస్ సరారుకు రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెబుతాం.
-సర్దా ఆనంద్, జామిడి రైతు, మండలం తాంసి
క్వింటాలుకు రూ.1400 నష్టపోయిన
నేను నాలుగెకరాల్లో పత్తి, సోయాబీన్ వేసిన. 20 క్వింటాళ్ల పత్తిని సీసీఐకి అమ్మడానికి ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు పోతే తేమ ఎక్కువ ఉందని కొనలేదు. పత్తిని క్వింటాలుకు రూ.6700 చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు అమ్మిన. సీసీఐ కొనకపోవడంతో మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.1400 చొప్పున తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. సీసీఐ సిబ్బంది ఏమీ చేస్తే అదే ఫైనల్‌గా ఉంది. పంటను ఎండబెట్టి తీసుకుపోయినా కొనడం లేదు.
– దేవిదాస్, రైతు, గూడ, భోరజ్ మండలం
నిబంధనలు లేకుండా కొనాలి
రైతుల తక్లీబ్ చూసి ఇప్పటికైనా నిబంధనలు లేకుండా పత్తి, సోయాబీన్ పంటలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలే. వర్షాలతో సోయాబీన్ కొంత పాడైంది. పంట ఖరాబ్ ఉందని మార్కెట్‌యార్డులో కొంటలేరు. వాపస్ తీసుకుపొమ్మంటున్నరు. వర్షాలతో పంట పాడైతే రైతులు ఏం చేస్తరు. గ్రేడింగ్ సిస్టమ్ పెట్టి పంట కొనాలి. సోయాను మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో తీసుకోకపోవడంతో ప్రైవేట్‌కు విక్రయించి క్వింటాలుకు రూ. వెయ్యి చొప్పున నష్టపోతున్నం.
– సురేశ్, రైతు, లేఖర్వాడ, భోరజ్ మండలం
చిన్న ఫోన్లో కిసాన్ యాప్ వస్తలే..
తాంసి, నవంబర్ 21 : భోరజ్ మండలం సావాపూర్లో మూడు ఎకరాల్లో పత్తి సాగుచేసిన. ఈసారి వానలతో పంట ఖరాబ్ అయింది. పత్తి అమ్ముదామంటే స్లాట్ బుకింగ్ చేయాలంటున్నరు. నా చిన్న ఫోన్లో కిసాన్ యాప్ రావట్లేదు. నేను ఎలా స్లాట్ బుక్ చేయాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెద్ద ఫోన్ లేదు. మునుపటిలాగే అన్ని పంటలు కొంటే మంచిగుంటది. ఈ కాంగ్రెస్ సరారు వచ్చిన కాడి నుంచి మా రైతులను పట్టించుకుంటలేరు. కేసీఆర్ సరారే బాగుండే.
– జవాజీ సిటింగ్ రావ్, రైతు, సవాపూర్, భోరజ్ మండలం
కేసీఆర్ సర్కారే మంచిగుండే..
తాంసి, నవంబర్ 21 : నాకున్న మూడెకరాల్లో పత్తి పండించిన. కేసీఆర్ సార్ వచ్చినంకనే మాకు రైతుబంధు ఇచ్చి ఆదుకున్నడు. గీ కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లా కష్టాలు షురూ అయినయ్. పంట అమ్ముదామంటే తేమ బరాబర్ లేదంటున్నరు. కొనడం లేదు. రైతుల కష్టపెట్టే గీ కాంగ్రెసోళ్లకు బుద్ధి చెప్పి తీరుతం. వచ్చే ఎన్నికల్లో మళ్లా కేసీఆర్ సరారే వస్తుంది. అప్పుడు మా రైతులందరి బాధలు పోతయి. ఇది ముమ్మాటికీ నిజం.
-కేమ నారాయణ, రైతు, వాన్వాట్, ఆదిలాబాద్ రూరల్
కండిషన్లు లేకుండా కొనాలి..
తాంసి, నవంబర్ 21 : 15 ఎకరాల్లో పత్తి పండించిన. ఆ సమయంలో యూరియా దొరకక మస్తు తిప్పలైంది. ఇప్పుడేమో తేమ ఎకువగా ఉందని పంట కొంట లేరు. ఒకవేళా కొన్నా ఎకరాకు ఏడు క్వింటాళ్లే జోకుతున్నరు. మొన్న కేటీఆర్ వచ్చిండని ఎకరాకు 10 క్వింటాళ్లు కొంటమన్నరు. కండిషన్లు పెట్టకుండా ఎకరాకు 15 క్వింటాళ్లు కొనాలి. లేదంటే తగిన సమయంలో గీకాంగ్రెస్కు బుద్ధి చెబుతాం.
– మషికెరి భూమన్న, వాన్వాట్, రైతు, ఆదిలాబాద్ రూరల్