Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు శనివారం జీవోను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఎలా అమలులోకి తీసుకురావాలో స్పష్టమైన ప్రక్రియను వివరించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. ఇక మహిళలకు 50 శాతం వరకు రిజర్వేషన్లకు కల్పించాలని నిర్ణయించింది. ఈ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సహా అన్ని కేటగిరీల్లో సమానంగా అమలు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. గత (2019) ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్లు కేటాయించారో , వాటిని పరిగణనలోకి తీసుకుని తాజా రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇక వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 సెన్సస్ ఆధారంగా( బీసీ సర్పంచ్ అభ్యర్థులకు 2024 కుల సర్వే) రిజర్వేషన్లు కల్పించింది.