దహెగాం, నవంబర్ 21 : ఆదివాసీ బిడ్డ, నిండు గర్భిణిని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రెలో శ్రావణి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆమె హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. శ్రావణి కు టుంబానికి సర్కారు నుంచి అందాల్సిన సాయం గురించి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఆపై కొంత ఆర్థికసాయమందించారు. ఆయన మాట్లాడు తూ గర్భిణిని హత్య చేసినందుకు జంట హత్యలుగా పరిగణించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు.
హత్య జరిగి నెల రోజులైనా ఆదివాసీ తెగకు చెందిన మంత్రి సీతక్కతో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి రూ. 8.50 లక్షలు రావాల్సి ఉందని, 4న రూ. 4,12,500 చెందిన ప్రొసీడింగ్ మాత్రమే ఇచ్చారని, ఇప్పటికీ చెక్కు అందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.
కల్వాడలో అక్రమ పట్టాలను రద్దు చేయాలి
కల్వాడ గ్రామంలో సర్వే నం.171లోని భూమిని అక్రమంగా పట్టాలు చేశారని, వాటిని రద్దు చేయాలని, ఇందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వాడ గ్రామాన్ని సందర్శించారు.
బాధిత రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు చెప్పుకున్నారు. గ్రామానికి చెందిన కళావతి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తూ అధికారుల అండతో తనతో పాటు తన భర్త హట్కరి మధూకర్, వారి కుటుంబ సభ్యుల పేరున సదరు భూమిని అక్రమంగా పట్టాలు చేయించుకున్నదని ఆరోపించారు.
బీఆర్ఎస్లో చేరికలు
చౌక, కల్వాడ గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి యువకులు 50మందికి పైగా సంఖ్యలో చేశారు. ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయాచోట్ల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, సలీమ్, జర్పుల బాలు, మల్లేశ్, సుధాకర్, బబ్లూ, ప్రకాశ్, సూరి పాల్గొన్నారు.