‘వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయమంటున్నరు! ఏయే పంటలు వేయమంటరు? యాసంగిలో సన్నరకం వడ్లు వేయొచ్చా? ఈ సమయంలో నువ్వులు, పెసర్లు సాగు చేస్తే దిగుబడి ఉంటుందా? చెరువు కింద మా భూమి ఉంది.. ఎలాంటి పంటలు వేయాలి? ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? దేశీయ విత్తన వరి సాగుకు మన నేలలు అనుకూలమా? వరికి బదులు టమాట పంట సాగు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందా? లేదా గోధుమ పంట సాగు చేయవచ్చా? కోతులు, అడవిపందుల బెడద ఎక్కువగా ఉంది? ఎలా నివారించాలి? పల్లికాయ సాగు చేయొచ్చా? ఏ విత్తనాలు మంచి దిగుబడి ఇస్తాయి’?.. ఇలా సిద్దిపేట జిల్లా నలుమూలల నుంచి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్‌కుమార్‌తో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ‘ఫోన్ ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించగా, రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. వివిధ గ్రామాల రైతులు 90మంది రైతులు నేరుగా ఫోన్లు చేయగా, ప్రత్యామ్నాయ సాగుతో వచ్చే లాభాలను వివరించారు. ఏ పంట ఏ కాలంలో వేయాలి? పంట కాల పరిమితి.. దిగుబడి.. సాగు ఖర్చు.. మార్కెట్ సౌకర్యం.. అందుబాటులోని విత్తనాలు.. ఇలా ప్రతి అంశాన్ని రైతులకు వివరించారు.
యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సన్నద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్‌కుమార్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. వివిధ గ్రామాల రైతులు నేరుగా వ్యవసాయ శాఖ అధికారికి ఫోన్ చేసి, సాగులో మెలకువలు, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం సాగింది. ఫోన్ ఇన్‌కు జిల్లా నలుమూలల నుంచి 90మంది రైతులు ఫోన్లు చేసి ప్రశ్నలు అడిగారు. సమయం అయ్యాక కూడా రైతుల నుంచి ఫోన్లు రావడంతో వారికి సాగు వివరాలను వివరించారు. రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడంతో వచ్చే లాభాలను వివరించారు. ఏ పంట ఏ కాలంలో వేయాలి? పంట కాల పరిమితి.. దిగుబడి.. సాగు ఖర్చు.. మార్కెట్ సౌకర్యం.. అందుబాటులోని విత్తనాలు.. ఇలా ప్రతి అంశాన్ని రైతులకు వివరించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ
అధికారి సమాధానాలు వారి మాటల్లోనే..
సిద్దిపేట ప్రతినిధి, సిద్దిపేట, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)
నమస్తే సర్.. నేను తిరుపతి. నారాయణరావుపేట మండలం గోపులాపూర్ మాది. యాసంగిలో ప్రత్యామ్నాయంగా సన్నరకం వడ్లు వేయొచ్చా? ఈ సమయంలో నువ్వులు, పెసర్లు సాగు చేస్తే దిగుబడి ఉంటుందా?
సన్న రకం వడ్లు సాగు చేస్తే బియ్యం రూపంలో మంచి మార్కెట్ ఉంది. సన్న బియ్యానికి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఏ పంట సాగు చేసిన దానికి మార్కెట్ సౌకర్యం అనేది ముఖ్యమైంది. పప్పుదినుసుల సాగుతో 60 నుంచి 70 రోజుల్లో మంచి పంట దిగుబడి వస్తుంది. రెండు తడుల నీటితో పంటలు పండుతాయి. కూరగాయలు, మినుములు, వేరుశనగకు మంచి డిమాండ్ ఉంది.
నమస్కారం సర్.. మేం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లయ్య. మాది అక్కన్నపేట గ్రామం. చెరువు కింద మా భూమి ఉంది.. ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి?
వరి సాగు వల్ల మార్కెటింగ్ ఇబ్బంది ఏర్పడుతుంది. పంట మార్పిడితో భూసారం పెరుగుతుంది. అక్కన్నపేట, హుస్నాబాద్ ప్రాంతాలు సీడ్ ప్రొడక్షన్ ఏరియాలు. సీడ్ కంపెనీలతో మాట్లాడి ఒప్పందం చేసుకొని వరి సాగు చేయవచ్చు. సన్నరకాలైతే బియ్యం రూపంలో మార్చి అమ్ముకోవాలి. నాణ్యమైన సన్ ప్లవర్ విత్తనాలు ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువస్తాం. నల్లరేగడిలో మొక్కజొన్న పంట వేసుకోవచ్చు. కానీ, అందులో డెయిరీ కోసం, స్వీట్ కార్న్, పచ్చికంకులు అమ్ముకుంటే మంచి లాభాలు ఉన్నాయి. ఏఈవోలు మీ వద్దకు వచ్చి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తారు. హుస్నాబాద్, కోహెడ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా వేరుశనగను సాగు చేస్తున్నారు. ఆ పంట వల్ల మంచి లాభాలు ఉన్నాయి. నువ్వులు కూడా సాగుచేసుకోవచ్చు.
హలో సర్.. నేను దౌల్తాబాద్ మండలం సూరంపల్లి నుంచి ప్రభాకర్‌ని. యాసంగిలో ఏయే పంటలు సాగు చేస్తే బాగుంటుంది?
దౌల్తాబాద్ మండలంలో గతంలో ఎక్కువగా ఆరుతడి పంటలే సాగయ్యాయి. నల్లరేగడి నేలల్లో పెసర్లు, మినుములు సాగు చేసుకోవచ్చు. మినుములు క్వింటాల్‌కు రూ.5110 మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చింది. దౌల్తాబాద్ మండలంలో ఎక్కువగా బీన్స్ సాగు చేస్తారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మొక్కజొన్న సాగుకు సీడ్ కోసం కంపెనీలతో టయాపై వేస్తున్నారు. జొన్నలు సాగు చేసుకోవచ్చు. మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం జొన్నలకు క్వింటాల్‌కు రూ.2700 మద్దతు ధర ప్రకటించింది.
నమస్కారం సర్.. నేను రైతు అనీల్‌కుమార్‌ని. చింతమడక నుంచి. నీటి సౌకర్యం ఉన్నప్పుడు వరి వద్దంటున్నారు? మరీ ఏయే పంటలు వేయాలి? విత్తనాలు అందుబాటులో ఉన్నాయా?
ప్రభుత్వం నీటి సౌకర్యం కల్పించింది పంటల సాగు కోసమే. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేరుశనగ, కూరగాయ పంటలు పండించుకునేందుకు మీ గ్రామం అనుకూలమైంది. పొద్దుతిరుగుడు విత్తనాలను ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకవస్తాం. అవసరమైన విత్తనాలన్నీ ఆగ్రో సెంటర్లో అందుబాటులో ఉన్నాయి.
నమస్తే సర్.. నేను మిరుదొడ్డి నుంచి రైతు చంద్రం. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? వాటిని సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందా?
యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయడం కోసం ప్రభుత్వం అవసరమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకవస్తుంది. ఎర్రనేలల్లో అయితే పల్లికాయ, ఆముదం, కుసుమ, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటలు వేసుకోవచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నల్లరేగడిలో అయితే మినుములు, శనగ పంట వేసుకోవచ్చు. అవసరమైన విత్తనాలు ఆగ్రో రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. మినుములు క్వింటాల్‌కు ప్రభుత్వం రూ.5100 మద్దతు ధర ప్రకటించింది.
సర్ నమస్తే.. నేను రైతు మశ్చేందర్, కామారెడ్డి నుంచి. ఈ సమయంలో పల్లికాయ సాగుచేయవచ్చా..? ఏ విత్తనాలు మంచి దిగుబడి ఇస్తాయి?
పల్లికాయను జనవరి 15తర్వాత సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న వేరుశనగ విత్తనాల్లో కే-6 రకం అనువైనది. ఈ విత్తనాలు మీ సమీపంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. మీ జిల్లాకు సంబంధించిన వ్యవసాయాధికారిని సంప్రదించి పంటను సాగు చేసుకోవాలి.
సర్ మేం తిరుపతి, హన్మంతు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు మాది. చెరువు కింద పొలాలున్నాయి. జాలు వస్తుంది. పంట మార్పిడి ఎలా సాధ్యం? సెరికల్చర్ సాగు చేయొచ్చా? డ్రిప్,
స్ప్రింక్లర్లతో సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందా?
చెరువులు, కుంటల కింద పొలాల్లో జాలు రావడం వల్ల జీలుగ, జనుము పంటలను సాగు చేయవచ్చు. దీంతో భూసారం పెరుగుతుంది. తినడానికి అవసరమైన సన్న రకాలు పండించ్చొచ్చు. ప్రభుత్వం ఆరుతడి పంటలకు మద్దతు ధర ఇచ్చింది. ముఖ్యంగా శనగలు, వేరుశనగ, పంటలు వేసుకోవచ్చు. జనవరి 15 తర్వాత నువ్వులు, మినుములు, కుసుములు వేసుకోవచ్చు. ఇది 60 రోజుల పంట. సెరికల్చర్ సాగు కూడా మంచింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ మన పట్టుకు మంచి డిమాండ్ ఉంది. సెరికల్చర్ షెడ్డు నిర్మాణానికి ఎక్కువగా ప్రోత్సాహకం ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. యాసంగిలో వరి పంటకు ప్రత్యేక పరిస్థితులున్నాయి. సొంతింటి అవసరాలకు సరిపడా సన్నరకం సాగు చేయవచ్చు. సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సాగు చేయవచ్చు. సిద్దిపేట జిల్లాలో డ్రిప్ కింద కూరగాయల సాగు ఎక్కువగా చేస్తున్నారు. నెటాఫిన్ కంపెనీ వారు నూతనంగా మంచి డ్రిప్ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకవచ్చారు. దీని ద్వారా మంచి ఉపయోగం ఉంది. యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయడంతో ఆరు నెలల్లో రెండు రకాలుగా పంటలు పండించుకోవచ్చు. కలుపు నివారణకు కూలీల సమస్య లేకుండా ప్రీ ఎమర్జెన్సీ మందులను పిచికారీ చేయాలి. మీ సంబంధిత ఏఈవోలను కలిసి మీ నేల స్వభావాన్ని బట్టి ఏయే పంటలు సాగు చేయాలో తెలుసుకోండి.
సర్ నమస్తే.. నేను అక్కన్నపేట నుంచి మల్లారెడ్డిని. పొద్దు తిరుగుడు విత్తనాలు అందుబాటులో లేవు.. ఏయే పంటలు వేయాలి? ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తారా?
వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు కోసం రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తాం. నేలల స్వభావాన్ని బట్టి ఏయే పంటలు వేయాలనేది స్థానిక ఏఈవోల ద్వారా రైతులకు తెలియజేస్తాం. పొద్దుతిరుగుడు విత్తనాలు ఈ నెలాఖరు వరకు అందుబాటులోకి తీసుకవస్తాం. పెసర్లు సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. 60 నుంచి 70 రోజుల్లో పంట చేతికొస్తుంది. పెసర్లకు ప్రభుత్వం మద్దతు ధర రూ.7275 ప్రకటించింది. వీటితో పాటు కుసుమలు, ఆవాలు, పల్లి పంటలు, నల్ల నేలల్లో అయితే మినుములు, శనగలు వేసుకోవాలి. పెసర పంటకు ఖర్చు రూ.10 నుంచి 15 వేల వరకు వస్తుంది. పెసర పంట సాగుతో మంచి లాభాలు ఉన్నాయి.
హలో.. అగ్రికల్చర్ ఆఫీసర్ గారా! నేను రైతు రాజును.. వర్గల్ మండలం అనంతగిరిపల్లి మాది. వరికి బదులు టమాట పంట సాగు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందా? లేదా గోధుమ పంట సాగు చేయవచ్చా?
ములుగు, వర్గల్ మండలాలు కూరగాయలు పండించేందుకు మంచి అనువైన ప్రాంతాలు. మార్కెటింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. నవంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూరగాయల సాగుకు అనుకూలమైన సమయం. టమాట, మిర్చి, కాలిఫ్లవర్ నారును మీకు అందుబాటులోకి తీసుకవస్తాం. కూరగాయల సాగుతో మంచి ఫలితాలున్నాయి. మార్కెట్లో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. వరి కల్లాల నిర్మాణం ఈజీఎస్ ద్వారా జరుగుతుంది. సెకండ్ ఫేజులో కల్లాలు నిర్మించే వీలుంది. హైదరాబాద్‌కు దగ్గర ఉండడంతో కూరగాయలకు మంచి గిరాకీ ఉంది.
సర్ నమస్తే.. నేను మహేశ్‌ను. చిన్నకోడూరు మండలం శంకరాయకుంట నుంచి. రెండేండ్లుగా దేశీయ విత్తన వరి సాగు చేస్తున్న. యాసంగిలో మన నేలలు అనుకూలమా?
దేశీయ వరిధాన్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటికి కస్టమర్లు ఉన్నారు కాబట్టి, రెగ్యులర్ వరి సాగు కాకుండా వీటిని సాగు చేసుకోవచ్చు. మన నేలలు వీటికి అనుకూలంగా ఉంటాయి.